బెంగుళూరు: గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతే... సగటు అభిమానినే కాదు, జట్టులోని ఆటగాళ్లు సైతం జీర్ణించుకోలేని పరిస్థితి. ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా బుధవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్ల పరిస్థితి దాదాపుగా ఇదే.
19.3 ఓవర్ల వరకు బంగ్లాదేశ్ జట్టు గెలవడం ఖాయమని భావించిన ప్రతి ఒక్కరికీ... చివరి మూడు బంతుల్లో అంతా తారుమారై విజయం దూరమైతే.. వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. క్రికెట్‌లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే.
Also Read: క్రికెట్లో ఇదో అద్భుతం!: భారత్-బంగ్లా మ్యాచ్, కీలక మలుపులివే (పిక్చర్స్)

అయితే భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో ఇలా జరుగుతుందని ఎవరూ కలలో కూడా ఊహించలేరు. చివరి ఓవర్ వేసిన భారత్ బౌలర్ హార్దిక్ పాండ్యా కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండకపోవచ్చు. తొలి మూడు బంతుల్లో పరుగులు సమర్పించుకున్న పాండ్యా, బంగ్లా బ్యాట్స్‌మెన్ తప్పిదాల వల్లే భారత్‌కు ఊహించని విజయం అందించాడు.
నాలుగు, ఐదు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీశాడు. చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సిన తరుణంలో బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వికెట్లకు దూరంగా నేరుగా కీపర్ చేతిలోకి వెళ్లేలా బంతిని విసిరాడు. ఆ బంతిని అందుకున్న ధోనీ సూపర్ జెట్ కంటే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి స్టంపింగ్ చేశాడు.

దీంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియా చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒక్కసారిగా స్టేడియంలోని భారత్ అభిమానులంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటే, బంగ్లాదేశ్ అభిమానులతో పాటు, ఆ జట్టు ఆటగాళ్లు నిశ్చేష్టులై వెక్కివెక్కి ఏడుస్తూ మైదానాన్ని వీడారు.
అంతకముందు ఎనిమిదో ఓవర్లో జడేజాను బౌలింగ్‌కు దించిన ధోనీ ఫలితం రాబట్టాడు. నాలుగో బంతికి క్రీజు ముందుకొచ్చి ఆడబోయిన తమీమ్‌ను ధోనీ స్టంపౌట్ చేశాడు. ఇక పాండ్యా బౌలింగ్‌లో రెండు ఫోర్లు సాధించిన షబ్బీర్ జోరందుకున్నాడు. అయితే రైనా బౌలింగ్‌లో అద్భుత స్టంపింగ్‌తో ధోనీ అతణ్ణి అవుట్ చేసి భారతకు బ్రేక్ ఇచ్చాడు.