ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలలో ఒకరై ఉంటారని సమాధానం సాధారణంగా వినిపిస్తుంటుంది. కానీ సచిన్, కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలను మించిన రిచెస్ట్ క్రికెటర్ ఉన్నాడు. 22 ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏకంగా రూ.70 వేల కోట్లకు అధిపతి అయ్యాడు. అతనే ఆర్యమన్ బిర్లా!
వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ల లిస్ట్‌లో ఆర్యమన్ విక్రమ్ బిర్లా టాప్‌లో ఉన్నాడు. 1997లో జన్మించిన ఆర్యమన్ విక్రమ్ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. ఆర్యమన్ బిర్లా వ్యాపార రంగంతో పాటు క్రికెట్‌లోనూ రాణించాడు. 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతను తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.

దేశవాళీ క్రికెట్‌లో ఆర్యమన్ మధ్యప్రదేశ్ తరఫున ఆడాడు. తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, నాలుగు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 414 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 103 నాటౌట్. బెంగాల్‌పై ఈ అజేయ సెంచరీ సాధించి జట్టును ఓటమి కోరల్లో నుంచి తప్పించాడు. ఇక లిస్ట్-ఏలో 36 పరుగులే చేశాడు. అయితే 2018లో రాజస్థాన్ రాయల్స్ ఆర్యమన్‌ను 30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే రెండేళ్లు రాజస్థాన్ ఫ్రాంచైజీతోనే ఉన్న ఆర్యమన్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆర్యమన్ బిర్లాను రాజస్థాన్ రాయల్స్ 2019 నవంబర్‌లో విడిచిపెట్టింది. అయితే ఓ నెల తర్వాత.. 2019లో ఆర్యమన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా, ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆర్యమన్ రూ.కోట్లు సంపాదించాడు. గతేడాది ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటెయిల్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు కూడా డైరెక్టర్‌గా సేవలందిస్తున్నాడు.
కాగా, ఆర్యమన్ బిర్లా నికర ఆస్తి విలువ రూ.70 వేల కోట్లకు పైగానే ఉంది. సచిన్ టెండూల్కర్ నికర విలువ దాదాపు రూ.1,100 కోట్లు. ఇక స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి నికర ఆస్తి విలువ రూ. 900 కోట్లు. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ఎంఎస్ ధోనీ సంపద దాదాపు రూ.800 కోట్లు మాత్రమే. ఆర్యమన్ ఆస్తి విలువ ముందు మన దిగ్గజ క్రికెటర్లు ఆస్తులు చాలా చాలా తక్కువ. సచిన్, కోహ్లి, ధోనీల మొత్తం నికర ఆస్తులను కలిపినా ఆర్యన్ ఆస్తిలో పది శాతం కూడా లేదు.