స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న అయిదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఘనంగా బోణీ కొట్టింది. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. డారిల్ మిచెల్ (61; 27 బంతుల్లో) విశ్వరూపం చూపించాడు. 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ (57; 42 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు.
అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ కాన్వాయ్ డకౌటయ్యాడు. కానీ, ఫిన్ అలెన్ (35; 15 బంతుల్లో) దూకుడుతో పాక్‌పై కివీస్ పైచేయి సాధించింది. ఫిన్ అలెన్ ఔటైన అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్‌తో కలిసి విలియమ్సన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. విలియమ్సన్ నిలకడగా ఆడితే మిచెల్ విజృంభించాడు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు.

మరోవైపు రెండు లైఫ్‌లు లభించిన విలియమ్సన్ 40 బంతుల్లో అర్ధశతకం సాధించి అబ్బాస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మరింత చెలరేగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.అనంతరం ఫిలిప్స్ (19; 11 బంతుల్లో) చాప్‌మన్ (26; 11 బంతుల్లో), సౌథి (6*; 2 బంతుల్లో) తలో చేయి వేయడంతో న్యూజిలాండ్ పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. బాబర్ అజామ్ (57; 35 బంతుల్లో) టాప్ స్కోరర్. ఓపెనర్ సయిమ్ అయుబ్ (27; 8 బంతుల్లో) జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ (25; 14 బంతుల్లో) కూడా రాణించాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు బ్యాట్లెత్తేయడంతో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
కివీస్ బౌలర్ టిమ్ సౌథి నాలుగు వికెట్లు సత్తాచాటాడు. ఈ క్రమంలో సౌథి టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పొట్టిఫార్మాట్‌లో 150 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్ల తీసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో షకిబ్ అల్ హసన్ ఉన్నాడు. భారత్ తరపున టాప్‌లో నిలిచిన చాహల్ 96 వికెట్లు తీశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 406 పరుగులు నమోదయ్యాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడిన టీ20ల్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌ల్లో ఇదే టాప్‌లో నిలిచింది.