హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఢిల్లీకి చెందిన మోహిత్ ఆహ్లావాట్ అనే బ్యాట్స్‌మెన్ టీ20 క్రికెట్‌లో 300 పరుగులు నమోదు చేశాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో 300 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్ మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
21 ఏళ్ల మోహిత్ ఆహ్లావాట్ రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 72 బంతుల్లో 14 ఫోర్లు, 39 సిక్సులతో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 34 పరుగులు రాబట్టిన మోహిత్ చివరి ఐదు బంతుల్లో 5 సిక్సులు బాదాడు.

దీంతో మోహిత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 416 పరుగులు చేసింది. ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మావి XI Vs ఫ్రెండ్స్ XI జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మోహిత్ ఈ ఘనతను సాధించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా 2015లో రాజస్ధాన్‌పై జరిగిన మ్యాచ్‌లో మోహిత్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.
ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చెందిన వెస్టిండిస్ ఆటగాడు 175 పరుగులు నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ 156 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.