హైదరాబాద్: మిథాలీ సేనకు బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతిని గురువారం అందజేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు భారత మహిళా క్రికెటర్లకు చెక్కులు అందజేశారు.
లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో అతిథ్య ఇంగ్లాండ్ చేతిలో మిథాలీ సేన 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో క్రీడాకారిణికి రూ.50 లక్షల చెక్కును అందచేసింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి టీమిండియా ఫైనల్‌కి చేరుకున్న సంగతి తెలిసిందే.
భారత మహిళల జట్టు పైనల్‌కు చేరిన సందర్భంగా బీసీసీఐ ప్రతినిధులు ఒక్కో క్రీడాకారిణికి రూ.50 లక్షలు, సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ చెప్పినట్లుగా గురువారం ఒక్కో ప్లేయర్‌ని సత్కరించింది.
అంతకుముందు క్రీడల మంత్రి విజయ్ గోయల్ భారత మహిళల జట్టుని అభినందించారు. ఈ సందర్భంగా గోయెల్ వారికి ప్రత్యేక జ్ఞాపికలు బహుకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'మన జట్టు వరల్డ్ కప్ టోర్నీలో అంచనాలకు మించి ప్రదర్శన చేసి రన్నర్స్‌గా నిలిచింది. వరల్డ్ ఫైనల్లో మన జట్టు ఫైనల్ గెలిచిందనే భావిస్తున్నాను. ఎందుకంటే ఫైనల్లో వారి పోరాట ప్రదర్శనతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు కాబట్టి. వీరు యువతకు స్ఫూర్తిగా నిలిచారు' అని గోయల్ అన్నారు.