వీరేంద్ర సెహ్వాగ్ గతంలో చెప్పినట్లుగానే 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీని బ్యాటింగ్ కు పంపమని తానే సూచించానని సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక గల రెండు ముఖ్యమైన కారణాలను సచిన్ తాజాగా వివరించారు.
రెడిట్ సెషన్‌లో సచిన్ వెల్లడి
'క్రికెట్ దేవుడు'గా అభిమానుల చేత అభిమానించబడే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. సోమవారం రెడిట్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక అభిమాని 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్ కంటే మహేంద్ర సింగ్ ధోనీని బ్యాటింగ్‌కు పంపమని ఎందుకు సూచించారని అడిగారు.

మ్యాచ్ సాగిన తీరు ఇలా..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు 114 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరిన తర్వాత సాధారణంగా యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కు రావాలి. కానీ యువీ స్థానంలో కెప్టెన్ ధోని బ్యాటింగ్‌కు దిగాడు. ఈ నిర్ణయం ధోనీది కాదని, అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌కు సచిన్ టెండూల్కర్ ఈ సూచన చేశారని తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు.
సచిన్ వెల్లడించిన రెండు కారణాలు ఇవే..
రెడిట్ సెషన్‌లో అభిమాని అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ సచిన్ టెండూల్కర్ ఈ వ్యూహాత్మక మార్పు వెనుక రెండు ప్రధాన కారణాలను వివరించారు. శ్రీలంక జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉన్నందున లెఫ్ట్ హ్యాండర్ అయిన గౌతమ్ గంభీర్‌తో కలిసి రైట్ హ్యాండర్ అయిన ధోనీని బ్యాటింగ్‌కు పంపడం సరైన నిర్ణయమని సచిన్ భావించారు. ఇది ప్రత్యర్థి ఆఫ్-స్పిన్నర్లకు బౌలింగ్ చేయడం కష్టతరం చేస్తుంది. మరోవైపు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 2008 నుంచి 2010 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాడు. ఆ మూడు సీజన్లలో ఎంఎస్ ధోనీ మురళీధరన్‌ను నెట్స్‌లో అనేకసార్లు ఎదుర్కొన్నారు. అందుకే మురళీధరన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ధోనీకి మంచి అనుభవం ఉందని సచిన్ నమ్మారు.
ఫైనల్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన నిర్ణయం
ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఒక పరుగుకే తొలి వికెట్ సెహ్వాగ్ రూపంలో కోల్పోయింది. ఆ తర్వాత 30 పరుగులకే సచిన్ కూడా 18 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీల భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. అయితే 114 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ 35 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ సూచన మేరకు క్రీజులోకి వచ్చిన ధోనీ గౌతమ్ గంభీర్‌తో కలిసి 119 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. గౌతమ్ గంభీర్ 97 పరుగుల వద్ద ఔటైన తర్వాత యువరాజ్ సింగ్ క్రీజులోకి వచ్చారు. చివరికి ధోనీ, యువరాజ్ సింగ్ కలిసి భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌ను నిలబెట్టారు. ఆ మ్యాచ్‌లో ధోనీ 79 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.