సిడ్నీ: సెమీ ఫైనల్లో భాగంగా ధోనీ సేన గురువారం నాడు ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సెమీ ఫైనల్లో భారత్ గెలిస్తే ఫైనల్లో కివీస్‌తో తలపడనుంది. అయితే, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ (ఎస్సీజీ)లో మనం గెలిస్తే మరికొన్ని రికార్డులు, భారత్, కెప్టెన్ ధోనీ సొంతమవుతాయి.
ఈసారి భారత్ ప్రపంచ కప్ గెలిస్తే అది మరో రికార్డ్ అవుతుంది. ఇప్పటి వరకు భారత్‌కు ప్రపంచ కప్ రెండుసార్లు వచ్చింది. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో గెలిచిన టీమిండియా.. 2011లో ధోనీ నేతృత్వంలో రెండోసారి గెలిచింది. ఈసారి గెలిస్తే ఒకే కెప్టెన్ సారథ్యంలో రెండు కప్‌లు గెలిచిన భారత సారథిగా ధోనీ రికార్డ్ సృష్టిస్తాడు.
ఈ ప్రపంచ కప్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఆస్ట్రేలియా పైన కూడా నెగ్గుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. సిడ్నీలో ధోనీ సేన గెలిస్తే...
భారత్ వరుసగా రెండసార్లు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన రికార్డ్
ప్రపంచ కప్ ఫైనల్‌కు రెండుసార్లు భారత జట్టును తీసుకు పోయిన కెప్టెన్‌గా ధోనీ రికార్డ్. అదీ వరుసగా ఫైనల్‌కు తీసుకు వెళ్లిన ఘనత.
ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలు.. రెండు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో పాల్గొన్న ముగ్గురు. వారు 2011 ప్రపంచ కప్‌లో ఉన్నారు. ఆర్ అశ్విన్ గత ప్రపంచ కప్ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ ఫైనల్ ఎడిషన్‌లో ఆడలేదు.
ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాను రెండుసార్లు ఓడించిన భారత జట్టు సారథిగా ధోనీ రికార్డ్ సృష్టిస్తాడు.

ధోనీపై క్లార్క్ ప్రశంసలు
భారత్ - ఆస్ట్రేలియా సమీ ఫైనల్‌కు ముందు క్లార్క్ భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ పైన ప్రశంసలు కురిపించాడు. తాను ముందే చెప్పానని, భారత జట్టు బాగా ఆడుతుందని, దాంతో పోరు ఇబ్బందని చెప్పానని, అలాగే అది ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్ గెలిచిందన్నాడు.
తాను అలా చెప్పడానికి కారణముందని, భారత్ చాలా కాలంగా ఇక్కడే ఉంటోందని చెప్పాడు. అది కలసి వచ్చిందన్నాడు. ఇక్కడే ఉన్న వారు వికెట్లు ఎలా తీయాలో బాగా ప్రాక్టీస్ చేశారన్నాడు. అలాగే, పరుగులు తీసేందుకు కూడా ప్రాక్టీస్ చేశారన్నాడు. అందుకే ఈ టోర్నమెంటులో వారు దూసుకుపోతున్నారన్నాడు.