టీమిండియాలో ఎప్పుడూ అన్యాయం జరిగే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది సంజూ శాంసన్ అని చెప్పాలి. అతను ఎంత గొప్పగా రాణించినా.. టీమిండియాలో అవకాశాలు దక్కడం కష్టం. ఇక ప్రస్తుతం విండీస్‌తో టీ20 సిరీసులో అతను రాణించడం లేదని అందరూ విమర్శలు చేస్తున్నారు.
కొందరైతే ఇలా ఫెయిలవడం వల్లనే సంజూకు టీమిండియా ఛాన్సులు దక్కలేదని అంటున్నారు. అయితే ఈ విమర్శలు కరెక్ట్ కాదని టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. సంజూను పొట్టి ఫార్మాట్‌లో సరిగా ఉపయోగించుకోవడం లేదని ఊతప్ప విమర్శించాడు. అతనికి ఏమాత్రం రోల్ క్లారిటీ ఇవ్వడం లేదని, టీంలో ఫ్లోటర్‌గా ఏ స్థానంలో పడితే ఆ స్థానంలో పంపుతున్నారని చెప్పాడు.

టాపార్డర్ ప్లేయర్ అయిన అతన్ని ఇలా పంపడం వల్ల కొత్త రోల్‌లో ఇమిడేందుకు సమయం పడుతుందని ఊతప్ప వివరించాడు. ఇలా అతని స్థానాన్ని మారుస్తూ ఉండటం వల్ల తను రిథమ్ అందుకోవడం సమస్యగా మారిందన్నాడు. ఐపీఎల్‌లో టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే సంజూ అద్భుతంగా రాణించాడు.
కానీ విండీస్‌తో సిరీసులో అతన్ని ఐదు, ఆరు స్థానాల్లో పంపారు. ఈ మ్యాచుల్లో ఒక దానిలో రనౌట్ అయ్యాడు. దీంతో సంజూ రాణించడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. 'సంజూ విషయంలో రోల్ క్లారిటీ లేకుండా పోయింది. ఈ విషయంలో అతనికి క్లియర్‌గా ఒక విషయం చెప్పేస్తే బాగుంటుందని నా భావన' అని ఊతప్ప చెప్పాడు.
'గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన అతన్ని.. కొత్త పాత్రలో లోయర్ ఆర్డర్‌లో పంపుతున్నారు. టాపార్డర్‌లో సక్సెస్ అయిన వాడిని ఇలా లోయర్ ఆర్డర్‌లో పడేయడంతో తడబడుతున్నాడు. ఇలాంటి సమయంలో తన ఆటకు రేటింగ్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం. కేవలం సంజూకే కాదు.. అందరికీ ఇదొక నెగిటివ్ సందేశం ఇస్తుంది' అని తెలిపాడు.