ఈ వరల్డ్ కప్‌లో భారత వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అద్భుతంగా ఆడుతున్నాడు. భారత్ ఆడిన తొలి మూడు మ్యాచులకు దూరమైన అతను.. జట్టులో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి మ్యాచులో రాణిస్తున్నాడు. ఇప్పటికి మూడుసార్లు ఐదు వికెట్లు తీసుకొని సత్తాచాటాడు. కేవలం ఆరు మ్యాచుల్లోనే 23 వికెట్లు తీసుకొని, ఈ టోర్నీలో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు ఇవ్వాలని టీమిండియా మాజీ లెజెండ్ యువరాజ్ సింగ్ చెప్పాడు. యువీ ఇలా చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, జట్టుకు అద్భుతమైన ఆరంభాలు అందిస్తున్న రోహిత్ శర్మను కాదని.. షమీకి ఈ అవార్డు ఇవ్వాలనడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

షమీ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాడు. కివీస్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏకంగా 7 వికెట్లు తీసుకొని భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. షమీ సూపర్ పెర్ఫామెన్స్ వల్లనే భారత జట్టు ఫైనల్ చేరిందనేది కాదనలేని సత్యం. మిగతా బౌలర్లు తడబడుతున్న సమయంలో కూడా షమీ బంతితో చెలరేగడం గమనార్హం.

ఆరో బౌలర్‌గా హార్దిక్ పాండ్యా ఉండటంతో భారత్ ఆడిన తొలి మూడు మ్యాచుల్లో షమీని తీసుకోలేదు. పాండ్యాకు గాయం అవడంతో ఆ తర్వాతి మ్యాచుల నుంచి షమీకి జట్టులో చోటు దక్కింది. అప్పటి నుంచి షమీ చెలరేగుతూనే ఉన్నాడు. 'భారత్ టీం బెంచ్‌పై ఎప్పుడూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. హార్దిక్‌కు గాయం అవడం ఒకవిధంగా అదృష్టమనే చెప్పాలి' అని యువీ అన్నాడు.
'అయితే పాండ్యా స్థానంలో వచ్చిన షమీ ఎలా ఆడతాడో? అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అతను వచ్చీరావడంతోనే స్టేజిపై మంటపెట్టాడు. అవుట్‌స్టాండింగ్ పెర్ఫామెన్స్‌తో చెలరేగాడు. అందుకే నన్నడిగితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు మహమ్మద్ షమీనే అర్హుడు అని చెప్తా' అని యువీ పేర్కొన్నాడు.