World Cup Final: ప్రస్తుతం క్రికెట్ ప్రేమికులంతా కూడా వరల్డ్ కప్ ఫైనల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక భారత్‌లో అయితే రోహిత్ మెరుపు ఇన్నింగ్సులు, కోహ్లీ సూపర్ సెంచరీలు, అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్సులు, రాహుల్ అదిరిపోయే బ్యాటింగ్.. ఇవే చర్యలు. ఇలాంటి టైంలో వెటరన్ బ్యాటర్ శిఖర్ ధవన్ పెద్ద బాంబు పేల్చాడు.
టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ గత వరల్డ్ కప్‌లో కూడా చెలరేగిన సంగతి తెలిసిందే. 2019 వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు హిట్‌మ్యాన్. ఇప్పుడు మాత్రం భారీ ఇన్నింగ్సులపై కాకుండా జట్టుకు శుభారంభాలు అందించడంపైనే ఫోకస్ పెట్టాడు. వరల్డ్ కప్ చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమైంది.

ఇప్పుడు శిఖర్ ధవన్ నెట్టింట ప్రత్యక్షమై.. ''ఇప్పుడు జట్టుకు అదిరే ఆరంభాలు ఇస్తున్న రోహిత్, 2019లో మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదిన హిట్‌మ్యాన్.. ఇద్దరిలో మీ ఫేవరెట్ అంటే ఎవర్ని ఎంపిక చేస్తారు?'' అని ప్రశ్నించాడు. అంతే నెట్టింట అగ్గిరాజుకుంది.
అప్పటి రోహిత్ ఎందుకు బెటర్ అని కొందరు చెప్తుంటే.. ఇప్పటి రోహిత్‌ను ఎవరూ బీట్ చేయలేరని మరికొందరు తేల్చేస్తున్నారు. 2019లో రోహిత్ ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా ఇప్పటికీ ఆ రికార్డు రోహిత్ పేరిటే ఉంది.
ఇక ఈ ఏడాది పది మ్యాచుల్లో 550 పరుగులు చేసిన రోహిత్.. ఒక్క సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఎలాంటి పిచ్ మీదనైనా సరే జట్టుకు ధనాధన్ ఆరంభాలు ఇస్తూ తర్వాత వచ్చే మిడిలార్డర్‌పై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ కూడా ఎవర్నీ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా ఆసీస్‌తో జరిగే వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా రోహిత్ ఇలాగే చెలరేగాలని కోరుకుంటున్నారు.