వన్డే వరల్డ్ కప్ మరోసారి టీమిండియా చేజారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో టీమిండియానే ట్రోఫీ ముద్దాడుతుందని అంతా అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు కంగారూల చేతిలో ఓడి వరల్డ్ కప్ చేజార్చుకుంది.
ఈ క్రమంలో ఆసీస్‌కు అభినందనలు తెలిపినందుకు ఆసీస్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్‌ను నెటిజన్లు టార్గెట్ చేశారు. 'భారతీయురాలు అయ్యుండీ.. ఆసీస్ గెలిస్తే కంగ్రాట్స్ చెప్తావా?' అంటూ మండిపడ్డారు. ఇలా తనపై విపరీతంగా ట్రోలింగ్ చేయడంపై విని స్పందించింది.

'ఎంతోమంది చాలా దారుణమైన మెసేజ్‌లు పంపుతున్నారు. ఇలా చెప్పాల్సి వచ్చినందుకు ఆశ్చర్యం వేస్తోంది. నేను భారతీయురాలినే అయినా కూడా.. నేను పుట్టి పెరిగిన దేశాన్ని సపోర్ట్ చేయడం అంత తప్పా? అంతకన్నా ముఖ్యంగా నా భర్త, నా బిడ్డకు తండ్రి ఆడుతున్న జట్టుకు మద్దతు ఇవ్వడానికి అసలు ఆలోచించాలా?' అని ఆమె ప్రశ్నించింది.
'ఇప్పటికైనా ఇలా మెసేజ్‌లు పంపుతున్న వారంతా ఒక చిల్ పిల్ తీసుకొని.. ఈ కోపాన్ని ఏదైనా మరో ప్రపంచ సమస్య మీదకు మళ్లిస్తే చాలా బాగుంటుంది' అని ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టింది. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత జట్టుకు అనుకున్న ఆరంభం దక్కలేదు.
శుభ్‌మన్ గిల్ (4) ఫెయిలయ్యాడు. అయితే రోహిత్ శర్మ (47), విరాట్ కోహ్లీ (54) ఇన్నింగ్స్ నిలబెట్టారు. అయితే అనవసర షాట్‌కు ప్రయత్నించిన రోహిత్ కూడా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ (4) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో కోహ్లీ, కేఎల్ రాహుల్ (66) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.
ఇక కోహ్లీ అవుటైన తర్వాత భారత బ్యాటింగ్ తేలిపోయింది. జడేజా (9), సూర్యకుమార్ యాదవ్ (18) ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఆసీస్‌ను భారత పేసర్లు కొంత కట్టడి చేశారు. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)ను త్వరగానే పెవిలియన్ చేర్చారు.
కానీ ట్రావిస్ హెడ్ (137), మార్నస్ లబుషేన్ (58 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో మంచు ప్రభావం కూడా పెరగడంతో భారత బౌలర్లు తడబడ్డారు. దీంతో ఆసీస్ జట్టు కేవలం 43 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో ట్రావిస్ హెడ్ అవుటయ్యాక.. క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2 నాటౌట్) తను వెంటనే డబుల్ తీసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.