మెల్బోర్న్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో 138 పరుగుల భారీ తేడాతో భారత్ గెలవడంతో కెప్టెన్ ధోనీ.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. అంతేగాక, మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును కూడా బ్రేక్ చేయనున్నాడు ధోనీ.
ఫిబ్రవరి 22న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచులో అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టు దక్షిణాఫ్రికా జట్టు భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ టోర్నీల్లో 11 మ్యాచులు ఆడిన ధోనీ నేతృత్వంలోని భారత జట్టు 9 విజయాలను నమోదు చేసింది.
2003లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు 11 మ్యాచులాడి 9 విజయాలను నమోదు చేసింది. ప్రపంచ కప్ టోర్నీలో విజయవంతమైన మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983, 1987 ప్రపంచ కప్ టోర్నీల్లో 15 మ్యాచులాడి 11 విజయాలను నమోదు చేసింది.
కాగా, 2015 ప్రపంచ కప్ టోర్నీలో కెప్టెన్ ధోనీ.. కపిల్ విజయాల రికార్డును బద్దలుకొట్టనున్నాడు. దీంతో ధోనీ భారత విజయవంతమైన కెప్టెన్ కానున్నాడు. 2011లో వన్డే వరల్డ్ కప్, 2007లో ప్రపంచ ట్వంటీ20, 2013లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు ఇప్పటికే విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ ఖ్యాతికెక్కాడు. మూడు ఐసిసి ట్రోఫీలను సాధించిన ఏకైక కెప్టెన్ కూడా ధోనీయే.

ప్రపంచ కప్ టోర్నీల్లో విజయాలను అందించిన భారత కెప్టెన్లు
1. కపిల్ దేవ్
- 11 విజయాలు (15మ్యాచులు) 4 పరాజయాలు (1983-1987)
2. మహ్మద్ అజారుద్దీన్
-10విజయాలు (23 మ్యాచులు) 12 పరాజయాలు, 1 డ్రా (1992-1999)
3. ఎంఎస్ ధోనీ
- (1ఓటమి, 1టై) 9విజయాలు (11 మ్యాచులు) (2011-2015)
4. సౌరవ్ గంగూలీ
- (2 ఓటములు) -9విజయాలు (11 మ్యాచులు) - 2003
5. ఎస్ వెంకటరాఘవన్
-1గెలుపు(6 మ్యాచులు)
6. రాహుల్ ద్రావిడ్
-1 గెలుపు(3 మ్యాచులు)