వరల్డ్ కప్: జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఘన విజయం

263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఆరంభంలో పర్వాలేదనిపించింది. బ్రెట్ లీ బౌలింగ్‌లో కొవెంట్రీ మెరుపు వేగంతో పాయింట్ దిశగా సిక్స్ బాదినపుడు 5 ఓవర్లలో 22/0తో ఉన్నపుడు జింబాబ్వే సంచలనం సృష్టించగలదనే అనిపించింది. ఐతే ఆరో ఓవర్లో కొవెంట్రీ (14), వికెట్ పడగానే జింబాబ్వేలో తడబాటు మొదలైంది. రెండో పవర్‌ప్లేలో ఆ తడబాటు తార స్థాయికి చేరి.. ఓటమికి దారి తీసింది. 11, 12, 13 ఓవర్లలో వరుసగా తైబు (7), టేలర్ (16), ఇర్విన్ (0) వరుసగా పెవిలియన్ చేరారు. జింబాబ్వే 44/4తో ఓటమికి బాటలు వేసుకుంది. చిగుంబుర (14), విలియమ్స్ (28) కాసేపు పోరాడినా.. స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. చకబ్వా (6) వారిని అనుసరించాడు. 104/7తో ఘోర పరాజయం దిశగా సాగుతున్న జింబాబ్వేను ఉత్సెయ (24; 45 బంతుల్లో 1X4), క్రీమర్ (37; 51 బంతుల్లో 4X4) ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 49 పరుగులు జోడించి జట్టు పరువు కాపాడారు. ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఈ జోడీని డేవిడ్ హసి విడదీశాడు. ఆ తర్వాత జింబాబ్వే ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగానే మొతెరాలో పరుగుల వరదేనని అందరూ ఆశించారు. కంగారూలు రికార్డు స్కోరుపై కన్నేసి ఉంటారని, ఓపెనర్లు తొలి బంతి నుంచే విరుచుకు పడతారని అనుకున్నారు. కానీ ఆసీస్ ఇన్నింగ్స్ అంచనాలకు భిన్నంగా ఆరంభమైంది. నెమ్మదైన పిచ్‌పై పరుగులు రాబట్టడానికి వాట్సన్, హడిన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పది ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 28 పరుగులే. హడిన్, వాట్సన్ పోటీపడి బంతులు వృథా చేశారు. 14వ ఓవర్లో కానీ ఆసీస్ ఇన్నింగ్స్ వేగం పుంజుకోలేదు. ఆ ఓవర్లో ఓపెనర్లు చెరో రెండు బౌండరీలు బాదడంతో 17 పరుగులొచ్చాయి. ఐతే పవర్‌ప్లే ముగిశాక స్కోరు వేగం మళ్లీ పడిపోయింది. 15-20 ఓవర్ల మధ్య 12 పరుగులే వచ్చాయి. ఈ మధ్యలోనే హడిన్ (29; 66 బంతుల్లో 3X4) ఔటయ్యాడు. అతను ఉత్సెయ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
తొలి వికెట్ పడ్డాక స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. ఓవర్లు తరిగిపోతుండటంతో వాట్సన్ బ్యాట్‌కు పనిచెప్పాడు. స్వేచ్ఛగా పరుగులు రాబట్టాడు. పాంటింగ్ ఆచి తూచి ఆడాడు. ఈ జోడీ కీలక భాగస్వామ్యంతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. 31 ఓవర్లలో 140/1తో ఆసీస్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ స్థితిలో క్రీజులో వాట్సన్, పాంటింగ్‌లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చి మ్యాచ్‌పై పట్టు సాధించింది జింబాబ్వే. వాట్సన్‌ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. ఆసీస్ రిఫరల్‌కు వెళ్లగా నిర్ణయం జింబాబ్వేకే అనుకూలంగా వచ్చింది. పొఫు డీప్ మిడ్‌వికెట్ నుంచి నేరుగా విసిరిన త్రోకు పాంటింగ్ రనౌటయ్యాడు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఆసీస్‌ను కుదురుకోకుండా చేశారు జింబాబ్వే బౌలర్లు. ఐతే క్లార్క్ చివరిదాకా క్రీజులో నిలిచి ఆసీస్ మెరుగైన స్కోరునందించాడు. డేవిడ్ హసి (8 బంతుల్లో 14; 1X4, 1X6), స్టీవెన్ స్మిత్ (4 బంతుల్లో 11; 1X4, 1X6) చివర్లో విలువైన పరుగులు చేశారు. చివరి 10 ఓవర్లలో ఆసీస్ 90 పరుగులు రాబట్టింది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వాట్సన్ (ఎల్బీ) (బి) క్రీమర్ 79; హడిన్ (ఎల్బీ) (బి) ఉత్సెయ 29; పాంటింగ్ రనౌట్ 28; క్లార్క్ నాటౌట్ 58; వైట్ (బి) పొఫు 22; డేవిడ్ హసి (బి) ప్రైస్ 14; స్మిత్ (సి) చకబ్వా (బి) పొఫు 11; జాన్సన్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 262
బౌలింగ్: పొఫు 9-0-58-2; ప్రైస్ 10-0-43-1; ఉత్సెయ 10-2-43-1; క్రీమర్ 10-0-41-1; టేలర్ 3-0-23-0; చిగుంబుర 2-0-18-0; విలియమ్స్ 6-0-29-0
జింబాబ్వే ఇన్నింగ్స్: టేలర్ (బి) టెయిట్ 16; కొవెంట్రీ (సి) అండ్ (బి) లీ 14; తైబు (సి) వాట్సన్ (బి) జాన్సన్ 7; ఇర్విన్ (ఎల్బీ) (బి) జాన్సన్ 0; చిగుంబుర (సి) హడిన్ (బి) క్రెజా 14; విలియమ్స్ (సి) వాట్సన్ (బి) టెయిట్ 28; చకబ్వా (ఎల్బీ) (బి) క్రెజా 6; ఉత్సెయ (సి) పాంటింగ్ (బి) డేవిడ్ హసి 24; క్రీమర్ (సి) హడిన్ (బి) జాన్సన్ 37; ప్రైస్ నాటౌట్ 5; పొఫు (సి) హడిన్ (బి) జాన్సన్ 2; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (46.2 ఓవర్లలో ఆలౌట్) 171
బౌలింగ్: టెయిట్ 9-1-34-2; బ్రెట్ లీ 8-1-34-1; జాన్సన్ 9.2-2-19-4; క్రెజా 8-0-28-2; వాట్సన్ 3-0-7-0; స్మిత్ 5-0-24-0; డేవిడ్ హసి 4-1-12-1
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications