ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కోసం అంతా సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. జట్లు కూడా నెమ్మదిగా తమ ప్లేయర్లను ఈ టోర్నీకి సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో గాయాల బారిన పడిన ఆటగాళ్లు కూడా కోలుకొని ఆయా జట్లతో చేరాలని చూస్తున్నారు. వీరిలో టీమిండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఒకడు. దాదాపు ఏడాది కాలంగా అతను ఆటకు దూరంగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో అతను ఈ ఏడాది వరల్డ్ కప్ ఆడతాడా? లేదా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్.. బుమ్రా విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చాడు. 'ఇటీవలి కాలంలో ఐసీసీ ఈవెంట్లలో జరిగిన పాకిస్తాన్, ఇండియా మ్యాచ్‌లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా అహ్మదాబాద్‌లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా' అని అశ్విన్ అన్నాడు.

'ఈ మ్యాచ్ కచ్చితంగా సమవుజ్జీల సమరంలా ఉంటుంది. ఎందుకంటే పాక్ వద్ద కూడా మంచి క్వాలిటీ పేస్ బౌలింగ్ ఎటాక్ ఉంది. ఇక భారత్ విషయంలో మేం కచ్చితంగా బుమ్రాను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. కుదిరితే ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫిట్‌గా ఉంటే ఆడతాడు. జట్టును ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడే తెలియదు. కానీ ఈ మ్యాచ్ మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పగలను' అని అశ్విన్ చెప్పాడు.
గతేడాది బుమ్రా విషయంలో తొందరపడిన బీసీసీఐ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అతన్ని ఆడించడం వల్ల బుమ్రా గాయం తిరగబెట్టింది. దీంతో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ రెండూ అతను ఆడలేదు. ఈ టోర్నీల్లో జరిగిన భారత్, పాక్ మ్యాచుల్లో కూడా లేడు. అయితే ప్రస్తుతం ఎన్సీయేలో ఉన్న అతను దాదాపు కోలుకున్నాడని సమాచారం. ఆగస్టు నెలలో జరిగే ఐర్లాండ్ టీ20 సిరీసులోనే బుమ్రా పునరాగమనం చేసే అవకాశం ఉంది.