AUSvsNED: ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా నల్ల ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి బరిలోకి దిగారు. ఇది చూసిన చాలామందికి ఆసీస్ ప్లేయర్లు ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు.
ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్లు ఢిల్లీ వేదికగా బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగులతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట డేవిడ్ వార్నర్ (104) క్లాసిక్ సెంచరీతో రాణించగా.. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (106) 40 బంతుల్లో తుఫాన్ సెంచరీ బాదడంతో ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇక అసాధ్యమైన 400 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు ఆసీస్ బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. 21 ఓవర్లలో కేవలం 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో 309 పరుగుల తేడాతో వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని ఆసీస్ సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ క్రికెటర్లంతా తమ ఎడమ చేతికి నల్ల ఆర్మ్‌బ్యాండ్స్ ధరించి కనిపించారు. ఈ విషయంపై ఆసీస్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా ఏసీసీ చేసిన పోస్ట్ ప్రకారం.. ఆసీస్ మాజీ క్రికెటర్ ఫవాద్ అహ్మద్ తన నాలుగు నెలల బిడ్డను కోల్పోయాడు. అతడికి, అతడి కుటుంబానికి తమ సానుభూతి తెలుపుతూ ఆసీస్ ఆటగాళ్లు ఈ బ్యాండ్‌లను ధరించారు.
రిస్ట్ స్పిన్నర్ ఫవాద్ అహ్మద్ 2013లో ఆసీస్ తరఫున డెబ్యూ చేశాడు. తన కెరీర్లో ఆసీస్ తరపున 2 టీ20లు, 3 వన్డేలు ఆడిన ఫవాద్ 6 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ఫవాద్ రెండోసారి తండ్రయ్యాడు. అయితే పుట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉండడంతో ఆసుపత్రిలో చేర్చించారు. కానీ మంగళవారం నాలుగు నెలల వయసున్న పసికందు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.