Yuvraj Singh: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి కేవలం క్రికెట్టే కాదు.. ఫుట్‌బాల్ అన్నా కూడా ఇష్టమే. ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కోహ్లీ వీరాభిమాని అని చాలా మందికి తెలిసిందే. ఇలా టీమిండియాలో ఫుట్‌బాల్ ఇష్టం ఉన్న మరో దిగ్గజం యువరాజ్ సింగ్. కోహ్లీ, యువీ దగ్గరవడానికి ఇది కూడా ఒక కారణమే.
ఈ క్రమంలోనే కోహ్లీ ఫుట్‌బాల్ స్కిల్స్ గురించి యువీ ఇటీవల జోకులు పేల్చాడు. కోహ్లీ బర్త్ డే రోజున అతన్ని తెగ మెచ్చుకున్న యువీ.. ఈసారి కోహ్లీ ఫుట్‌బాల్ టెక్నిక్స్‌పై జోకులు వేయడం చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూలో తనతోపాటు సెహ్వాగ్, ఆశిష్ నెహ్రాతో కూడా తను ఫుట్‌బాల్ ఆడే వాడినని యువీ చెప్పాడు.

'ఫుట్‌బాల్ ఆడే సమయంలో నాకు, విరాట్‌కు చాలాసార్లు గొడవలయ్యేవి. నాకు ఆశిష్ నెహ్రాతో కూడా ఫుట్‌బాల్ ఆడేటప్పుడు చాలా పెద్ద గొడవైంది. సెహ్వాగ్‌తో అయితే లెక్కలేనన్నిసార్లు గొడవ పడ్డా' అని యువీ వివరించాడు. వీళ్లంతా టీమిండియాలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ సమయంలో ఫుట్‌బాల్ ఆడే వాళ్లట.
'విరాట్‌కు తను చాలా పెద్ద ఫుట్‌బాల్ ప్లేయర్ అని ఫీలింగ్. తన వద్ద స్కిల్స్ ఉన్నాయి. కాదనట్లేదు. కానీ నా దగ్గర కోహ్లీ కన్నా బెటర్ ఫుట్‌బాల్ స్కిల్స్ ఉన్నాయి. బ్యాటింగ్‌లో కోహ్లీ నా కన్నా చాలా బెటర్. కానీ ఫుట్‌బాల్‌లో నేను బెటర్. తనకు తాను క్రిస్టియానో రొనాల్డో అనుకుంటాడు కోహ్లీ. కానీ తను కాదు. క్రికెట్‌లో అయితే కోహ్లీ.. క్రిస్టియానో రోనాల్డో స్థాయి ప్లేయరే. ఫుట్‌బాల్‌లో మాత్రం కాదు' అని చెప్పుకొచ్చాడు.
వీళ్లిద్దరూ చాలా మంచి స్నేహితులు. 2011లో వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో కోహ్లీ, యువీ ఇద్దరూ ఉన్నారు. మిడిలార్డర్‌లో వీళ్లిద్దరూ చాలాసార్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే ఆ మెగాటోర్నీ తర్వాత కేన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకున్న యువీ.. ఆటలో పట్టు కోల్పోయాడు. సరిగ్గా అదే సమయంలో కోహ్లీ అద్భుతమైన పట్టుదలతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు.