టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత అద్భుతమైన బ్యాటరో అంతే అద్భుతమైన ఫీల్డర్ కూడా. మైదానంలో చిరుతలా కదిలే విరాట్ ఎన్నో అదిరిపోయే క్యాచ్‌లు అందుకుని బెస్ట్ ఫీల్డర్ అనిపించుకున్నాడు. ఈ రోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2023 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో కూడా విరాట్ ఓ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్‌లను ఓపెనింగ్‌కు పంపించింది. అయితే ఇన్నింగ్స్‌ను స్లోగా స్టార్ట్ చేసిన ఆసీస్‌కు మూడో ఓవర్లోనే బుమ్రా షాకిచ్చాడు.

బుమ్రా విసిరిన అవుట్ స్వింగ్ బంతిని మార్ష్ కట్ చేయబోగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్స్‌లో ఉన్న కోహ్లీ వైపు దూసుకెళ్లింది. బంతి కోహ్లీకి ఎడమ వైపు నుంచి దూరంగా వెళ్లిపోతుండగా.. అమాంతం గాల్లోకి ఎగిరిన కోహ్లీ బంతిని ఒడిసిపట్టుకున్నాడు.
కోహ్లీ అందుకున్న ఈ స్పెక్టాక్యులర్ క్యాచ్‌తో చెపాక్ స్టేడియం మొత్తం ఫ్యాన్స్ కేరింతలతో దద్దరిల్లింది. కోహ్లీ అందుకున్న ఈ క్యాచ్‌తో ప్రపంచకప్ టోర్నీల్లో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
ఇదిలా ఉంటే నిన్న శనివారం చెపాక్ స్టేడియంలో కోహ్లీ డైవింగ్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే తరహాలో ఈ రోజు కోహ్లీ అందుకున్న క్యాచ్ ఉండడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నిన్న శాంపిల్ చూపించి ఈ రోజు అది నిజం చేశాడంటూ కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ తొలి వరల్డ్ కప్ ఆడుతోంది. అందులో భాగంగా ఈ రోజు తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. కమిన్స్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
టీమిండియా ఓపెనర్ గిల్ డెంగ్యూతో బాధపడుతుండడంతో అతడు లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. గిల్ స్థానంలో రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయబోతున్నాడు.