వరల్డ్ కప్ 2023ను భారత్ గెలుపుతో మొదలుపెట్టింది. ఆదివారం జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ గెలుపుతో ఒకపక్క మ్యాచ్‌లో విజయం సాధించడమే కాకుండా మరో పక్క ఎన్నో రికార్డులను టీమిండియా బద్దలు కొట్టింది. ఈ మ్యాచులో 200 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
అలాంటి టైంలో విరాక్ కోహ్లీ(85), కేఎల్ రాహుల్(97*) అద్భుతమైన బ్యాటింగ్‌తో మరో వికెట్ కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 4వ వికెట్‌కు 165 పరుగుల అదిరిపోయే పార్ట్‌నర్‌షిప్‌తో భారత్‌ను గెలిపించారు. అంతకుముందు భారత బౌలర్లు కూడా సూపర్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను 199 పరుగులకే ఆలౌట్ చేశారు.

సచిన్‌ను దాటేసిన కోహ్లీ..
ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేకమైన రికార్డులు బద్దలయ్యాయి. అందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఐసీసీ వైట్ బాల్ టోర్నమెట్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 85 పరుగులు చేసిన కోహ్లీ.. ఐసీసీ టోర్నీల్లో మొత్తంగా 2,785 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ (2719)ను కోహ్లీ అధిగమించాడు. ఇక కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (2,422), యువరాజ్ సింగ్ (1,707), సౌరవ్ గంగూలీ (1,671) ఉన్నారు.
స్టార్క్ సంచలనం..
ఇక రెండో రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నెలకొల్పాడు. ఆదివారం మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను అవుట్ చేసిన స్టార్క్.. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. దీనికోసం స్టార్క్ 941 బంతులు తీసుకోగా.. అతడి తర్వాత శ్రీలంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ్ ప్రపంచకప్ టోర్నీల్లో 50 వికెట్లు తీయడానికి 1,187 బంతులు తీసుకున్నాడు.
చెపాక్‌లో ఇదే ఫస్ట్..
మూడో రికార్డు కూడా ఆస్ట్రేలియాదే కావడం గమనార్హం. అదేంటంటే.. వరల్డ్ కప్‌లలో చెపాక్ స్టేడియంలో ఇప్పటి వరకు ఆసీస్‌కు ఓటమి లేదు. ఈ స్టేడియంలో 1987లో జరిగిన రెండు మ్యాచ్‌లలో, ఆ తర్వాత 1996 జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఆసీస్ విజయం సాధించింది. అందుకే ఈ మ్యాచులో కూడా ఆసీస్ గెలుస్తుందని చాలా మంది భావించారు. కానీ ఈ అంచనాలను తలకిందులు చేసిన కోహ్లీ, రాహుల్.. ఆసీస్‌కు ఈ స్టేడియంలో తొలి పరాజయం రుచి చూపించారు.