బ్యాట్స్‌మన్ మ్యాచ్‌లు గెలిపిస్తే.. బౌలర్లు టోర్నమెంట్లు గెలిపిస్తారనేది క్రికెట్లో ఏళ్లుగా వినిపిస్తున్న సామెత. ఈ సారి కూడా ప్రపంచకప్‌లో దాదాపు అదే జరిగేలా ఉంది. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్‌లతో పాటు మిగిలిన జట్లు బెస్ట్ బౌలింగ్ లైనప్‌తో బరిలో దిగాయి. అయితే ఆ బౌలర్లందరిలో టాప్ 5 బౌలర్ల గురించి మాట్లాడుకుంటే.. భారత్ నుంచి మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, న్యూజిల్యాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రీదీలు ఈ సీజన్లో అదరగొట్టేలా కనిపిస్తున్నారు.
1. మహ్మద్ సిరాజ్:
భారత యువ పేసర్ మహ్మద్ సిరాజ్ గురించి మాట్లాడుకుంటే.. ప్రపంచ క్రికెట్లో తక్కువ కాలంలో ది బెస్ట్ పేసర్ల లిస్ట్‌లో చేరిన బౌలర్ సిరాజ్. కుడిచేతి వాటం పేసర్ అయిన సిరాజ్ తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై తన విశ్వరూపం చూపించాడు. ఏకంగా 6 వికెట్లు తీసి తను ఎంతటి డేంజరస్ బౌలరో అందరికీ అర్థమయ్యేలా చేశాడు. బౌలింగ్‌లో పేస్ తగ్గకుండానే బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల టాలెంట్ సిరాజ్ సొంతం. దీన్ని బట్టి చూస్తే ఈ వరల్డ్ కప్ సీజన్‌లో సిరాజ్ తన పదునైన బంతులతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించడమే కాకుండా వికెట్ల వరద పారించగలడనడంలో ఎలాంటి సందేహం లేదు.

2. మిచెల్ స్టార్క్:
ఆస్ట్రేలియా పేస్ దళానికి వెన్నెముక లాంటి బౌలర్ మిచెల్ స్టార్క్. 2015 వరల్డ్ కప్‌లో 22 వికెట్లు తీసిన స్టార్ట్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2019 సీజన్లో కూడా 27 వికెట్లతో విజృంభించాడు. ఇక తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన వార్మ్‌లప్ మ్యాచ్‌లో కూడా హ్యాట్రిక్ తీసి తన బౌలింగ్‌లో ఏ మాత్రం పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. బౌలింగ్‌లో స్టార్క్ కన్‌సిస్టెన్సీని బట్టి చూస్తే ఈ ఏడాది కూడా స్టార్క్ కచ్చితంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
3. రషీద్ ఖాన్:
వరల్డ్ క్రికెట్‌లోని టాప్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒకడు. ఆఫ్ఘనిస్తాన్ తనపున బెస్ట్ బౌలర్‌గా తన లెగ్ స్పిన్ మాయతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగల సామర్థ్యం రషీద్ సొంతం. ఇప్పటివరకు రషీద్ ఖాన్ 94 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడి 172 వికెట్లు తీశాడు. ముఖ్యంగా భారత్‌లో ఐపీఎల్ ఎక్కువగా ఆడడం వల్ల ఇక్కడి పిచ్ పరిస్థితులపై రషీద్‌కి మంచి అనుభవం ఉంది. వీటన్నింటినీ బట్టి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ జట్టుగా ఎలాంటి ప్రదర్శన చేసినా రషీద్ మాత్రం తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టడం, వికెట్లు రాబట్టుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
4. ట్రెంట్ బౌల్ట్:
ఆస్ట్రేలియా తరపున మిచెల్ స్టార్ ఎలా అయితే కన్‌సిస్టెంట్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తున్నాడో, సరిగ్గా అదే తరహాలో న్యూజిల్యాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా తన జట్టులో నెంబర్ వన్ బౌలర్‌గా ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో బౌల్ట్ కూడా స్టార్ట్‌తో సమానంగా 22 వికెట్లు తీశాడు. ఇక 2019 ప్రపంచకప్‌లో కూడా 17 వికెట్లు తీసి న్యూజిల్యాండ్ తరపున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆడిన రెండు మ్యాచ్‌లలోనే 8 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ పెర్ఫార్మెన్స్‌ని బట్టి ఈ సీజన్లో బౌల్ట్ వికెట్ల వేటలో ఏ మాత్రం వేగం తగ్గదని అనిపిస్తోంది.
5. షాహీన్ అఫ్రీదీ:
పాకిస్తాన్ పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్న పేసర్ షాహీన్ అఫ్రీదీ. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో కూడా షాహీన్ భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్ వంటి జట్లను తన స్వింగ్ అండ్ పేస్‌తో బెంబేలెత్తించాడు. అందుకే పాకిస్తాన్ తరపున మ్యాచ్ విన్నింగ్ పేసర్ ఎవరంటే కచ్చితంగా షాహీన్ పేరే ముందుగా వినిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లలో షాహీన్ ప్రదర్శన చూస్తే.. ఎంత పెద్ద టోర్నీలో అయినా షాహీన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలడని అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తరపున షాహీన్ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టగలడు అనడంలో సందేహం లేదు.
వీళ్లు మాత్రమే కాకుండా జస్ప్రిత్ బుమ్రా, మథీసా పథిరన, టస్కిన్ అహ్మద్, అన్‌రిచ్ నార్ఖియా వంటి పేసర్లు కూడా ఈ టోర్నీలో అదరగొట్టే అవకాశం ఉంది.