వరల్డ్ కప్ మొదలైపోయింది. ఈ మెగాటోర్నీలో ఆడుతున్న జట్ల కెప్టెన్లు అందరూ తాజాగా కలుసుకున్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ కెప్టెన్స్ మీట్ ఘనంగా జరిగింది. అయితే ఈ మీటింగ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కునుకు తీస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అయింది.
కెప్టెన్ల మీటింగ్‌లో ఇలా నిద్ర పోవడం ఏంటని చాలా మంది బవుమాను ట్రోల్ చేస్తున్నారు. అంతకుముందు మీడియా, బ్రాడ్‌కాస్టర్లతో అందరు కెప్టెన్లు మాట్లాడారు. ఆ తర్వాత కెప్టెన్ల మీటింగ్ జరిగింది. ఈ సమయంలోనే బవుమా నిద్రపోతూ కనిపించాడు. ఈ ఫొటోను చాలా మంది తమ సోషల్ మీడియాలో పంచుకొని జోకులు పేల్చారు.

అయితే దీనిపై ఇప్పుడు బవుమా స్వయంగా స్పందించాడు. బర్మీ ఆర్మీ వాళ్లు కూడా ఈ ఫొటో షేర్ చేయగా దానికి సమాధానం ఇచ్చిన బవుమా.. 'ఆ కెమెరా యాంగిల్ వల్ల అలా కనిపిస్తోంది. నేను నిద్ర పోలేదు' అని ట్వీట్ చేశాడు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం అతని వాదన వినడం లేదు. బవుమా కచ్చితంగా నిద్రపోయాడనే అంటున్నారు.
కెమెరా యాంగిల్ వల్లనే తాను నిద్రపోయినట్లు కనిపిస్తోందని, కానీ తను కునుకు తీయలేదని బవుమా మాత్రం బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. కాగా వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాకు బవుమా సారధ్యం వహించడం ఇదే తొలిసారి. అక్టోబర్ 7న శ్రీలంకతో జరిగే మ్యాచుతో సఫారీలు ఈ వరల్డ్ కప్‌లో తమ జర్నీ మొదలు పెడతారు.
గతంలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరిగినప్పుడు సౌతాఫ్రికా తమ గ్రూప్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ భారత్‌లో వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో సౌతాఫ్రికాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈసారి కూడా అదే స్థాయిలో సఫారీలు రాణిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.