వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే మ్యాచులో కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుందని ఆ టీం మాజీ దిగ్గజం అంటున్నాడు. ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. రెండో మ్యాచుల భారత బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. దీంతో భారీ స్కోరు చేసిన భారత్.. పాకిస్తాన్‌ను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేసింది. అదే సమయంలో భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్తాన్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. ఈ ఓటమిని పాక్ టీం, వాళ్ల ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.

ఇదే విషయాన్ని పాక్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ గుర్తుచేశాడు. ఇలాగే కనుక పాక్ ఆడితే అక్టోబర్ 14న జరిగే వరల్డ్ కప్ మ్యాచులో కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అని అక్మల్ అభిప్రాయపడ్డాడు. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం బాగా ప్లాన్ చేసుకోవాలని సూచించాడు.
'ఆసియా కప్ ఆడిన మెంటాలిటీతో.. గత మూడేళ్లుగా ఆడినట్లే కనుక వాళ్లు ఆడితే మళ్లీ భారత్ చేతిలో పాక్ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఈ మ్యాచ్ కోసం పాక్ టీం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి' అని అక్మల్ చెప్పాడు. అలాగే భారత జట్టు గురించి కూడా తన అభిప్రాయం చెప్పాడీ మాజీ క్రికెటర్.
'మహమ్మద్ షమీకి ఆ టీంలో చోటు దక్కడం కష్టంగా మారింది. తను బెంచ్‌పై ఉన్నాడంటేనే అది ఎంత బలమైన బౌలింగ్ యూనిట్ అని అర్థం చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నారు. గిల్ ఇటీవలే సెంచరీ చేశాడు. అంటే వాళ్ల బ్యాటింగ్ కూడా పూర్తి బలంగా కనిపిస్తోంది' అని అక్మల్ అభిప్రాయపడ్డాడు.
'పాకిస్తాన్ టీం కనుక అక్టోబర్ 14న మ్యాచ్ కోసం సరిగా ప్రిపేర్ అవ్వకపోతే చిత్తుగా ఓడిపోవడం ఖాయం. దీనిలో ఎలాంటి మొహమాటం లేదు. గట్టిగా రెడీ అయ్యి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాలి. లేకపోతే గెలవడం చాలా కష్టం' అని అక్మల్ తేల్చిచెప్పాడు. ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను కూడా భారత బౌలింగ్ యూనిట్ చిత్తుచేసిన సంగతి తెలిసిందే.