భారత క్రికెట్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ టోర్నీలో అసలు సిసలు పోటీ భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాయాదిని ఢీ కొట్టేందుకు టీమిండియా రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా? అని కొందరు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
ఎందుకంటే.. ఈ మ్యాచ్ జరిగేది అక్టోబర్ 15న. ఆ రోజు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పుట్టిన రోజు. ఆ రోజున జరిగే మ్యాచ్ ఎలాగైనా గెలిచి తమ కెప్టెన్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని పాకిస్తాన్ టీం అంతా భావిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికితోడు నరేంద్ర మోదీ స్టేడియం ఎక్కువగా బ్యాటర్లకు, పేసర్లకు సహకారం అందిస్తుంది. పాక్ పేస్ బ్యాటరీ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

షహీన్ అఫ్రిదీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్ వంటి పేసర్లతో పాక్ బౌలింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. వారిని అహ్మదాబాద్‌లో ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అంతేకాదు, అహ్మదాబాద్‌లో పాక్ రికార్డు కూడా బాగానే ఉంది. ఇక్కడ పాక్ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. 2005 ఏప్రిల్ 12న జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసిన గెలవలేకపోయింది.
ఈ మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించగా.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. సచిన్ టెండూల్కర్ (123) భారీ శతకంతో అదరగొట్టాడు. దీంతో భారత జట్టు 315 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే పాక్ జట్టులో టాపార్డర్‌తోపాటు కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అద్భుతంగా రాణించాడు. అందరూ తలా ఒక చెయ్యి వేయడంతో ఈ మ్యాచ్‌లో పాక్ మూడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

వీటికి తోడు స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండటం, లక్ష మంది ప్రేక్షకుల ముందు మ్యాచ్ ఆడుతుండటం, వరల్డ్ కప్‌లో పాక్‌పై అద్భుతమైన రికార్డు ఉండటం.. ఇలాంటి కారణాల వల్ల ఈ మ్యాచ్‌లో భారత్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడికి తలొగ్గితే భారత్ ఓడిపోవడం గ్యారంటీ. ఇలాంటి సమయంలో మళ్లీ కోహ్లీ, రోహిత్ వంటి స్టార్లు చెలరేగితేనే భారత్ గెలుస్తుంది. టాస్ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం అయ్యే అవకాశం ఉంది.