వరల్డ్ కప్ వచ్చిందంటే చాలు.. టీమిండియాకు నాలుగో నెంబర్ సమస్య వచ్చిపడుతోంది. 2019 వరల్డ్ కప్‌లో కూడా ఇదే స్థానం పెద్ద సమస్యగా మారింది. అంబటి రాయుడును ఈ స్థానంలో ఆడించిన భారత జట్టు సడెన్‌గా ఈ మెగా టోర్నీలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేసింది. ఈ వ్యూహం ఎంత దారుణంగా బెడిసి కొట్టిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో కూడా భారత జట్టును ఇదే సమస్య వెంటాడుతోంది. దీనికి సరైన సమాధానం దొరక్కపోవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ షాకింగ్ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. ఓపెనర్‌గా భారీ సక్సెస్ చవిచూసిన కెప్టెన్ రోహిత్ శర్మను ఈ స్థానంలో పంపాలని ఆలోచిస్తోందట. అతని తర్వాత ఐదో నెంబర్‌లో కేఎల్ రాహుల్ వస్తాడట.

ఒకవేళ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఫిట్‌నెస్ సాధించక జట్టులోకి రాకపోతే.. నాలుగో నెంబర్‌లో రోహిత్‌ను పంపుదామా? అని థింక్ ట్యాంక్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఈ టీంకు ఓపెనింగ్ అందించే అవకాశం ఉంది. ఈ నెల 18న కేఎల్ రాహుల్‌కు ఫిట్‌నెస్ పరీక్ష పెడతారని సమాచారం.
ఆ టెస్టులో అతని పాసయితే ఐదో స్థానంలో రాహుల్ ఆడతాడు. ఈ టెస్ట్ తర్వాతనే ఆసియా కప్‌లో రాహుల్‌ను ఆడించాలా? వద్దా? అని సెలెక్టర్లు ఒక నిర్ణయానికి వస్తారు. అయితే అయ్యర్ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదు. నాలుగో నెంబర్‌లో ఇటీవలి కాలంలో అయ్యర్ చక్కగా రాణించాడు. కానీ అతను వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్నాడు.
రాహుల్, అయ్యర్ కనుక ఆసియా కప్ సమయానికి ఫిట్‌నెస్ సాధించకపోతే.. ఇద్దర్నీ వరల్డ్ కప్ బృందంలో కూడా ఎంపిక చేయడం జరగదని సమాచారం. ఈ మెగాటోర్నీకి ముందు గేమ్ టైం లేకపోవడం, ఫామ్‌పై అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. వరల్డ్ కప్ విషయంలో ఛాన్సులు తీసుకోవాలని సెలెక్టర్లు అనుకోవడం లేదట.
అందుకే వీళ్లిద్దరూ ఆడకపోతే.. నాలుగో నెంబర్‌లో సంజూ శాంసన్‌ను ఆడించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇటీవల విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో నాలుగో స్థానంలో వచ్చిన శాంసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ స్థానంలో వచ్చిన భారత బ్యాటర్ ఇలా అర్ధశతకం చేయడం ఈ ఏడాది ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వన్డేల్లో దారుణంగా విఫలం అవుతూ వస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను ఈ టీంలో తీసుకోవడంపై సెలెక్టర్లు సుముఖంగా లేరట. ఒకవేళ తీసుకున్నా కూడా ఐదో నెంబర్ తర్వాతనే అతన్ని బ్యాటింగ్‌కు పంపుతారని సమాచారం. లేదంటే విండీస్‌తో టీ20ల్లో రాణిస్తున్న తిలక్ వర్మను కూడా నాలుగో నెంబర్ కోసం ఎంపిక చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.