వరల్డ్ కప్ ముందు టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ సమయంలో గాయపడిన అక్షర్ పటేల్.. ఈ వరల్డ్ కప్ ఆడటం అసాధ్యమని తెలుస్తోంది. ఈ క్రమంలో అతని స్థానాన్ని ఆఫ్‌స్పిన్నర్‌తో భర్తీ చేయాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో సిరీసులో రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌లను ప్రయోగించింది.
వీరిద్దరూ కూడా బంతితో రాణించారు. అయితే అశ్విన్‌కు తను ఆడిన రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ ఈ రెండు మ్యాచుల్లో అశ్విన్ వికెట్లు తీసుకున్నాడు. ఇక మూడో వన్డేలో ఆడిన వాషింగ్టన్ సుందర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేసే అవకాశం కల్పించారు. బంతితో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సుందర్ వికెట్లు మాత్రం తీసుకోలేకపోయాడు.

ఇక బ్యాటింగ్‌లో ఎవరూ ఊహించని విధంగా ఓపెనర్‌గా వచ్చిన అతను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్‌లో సుందర్ కన్నా అశ్విన్ బెటర్ అని టీం మేనేజ్‌మెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎనిమిదో నెంబర్ వరకు బ్యాటింగ్ అవసరం అని జట్టు భావిస్తున్నప్పటికీ.. ఆ బ్యాటర్‌పై పూర్తిగా ఆధారపడాలనేది ప్లాన్ కాదు. కాబట్టి ఆ స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్ బౌలింగ్‌లో కచ్చితంగా సత్తా చాటాల్సి ఉంటుంది.
ఈ విషయంలో సుందర్ కన్నా అశ్విన్ బెటర్‌గా కనిపిస్తున్నాడు. దానికితోడు బ్యాటింగ్‌లో కూడా వన్డే తరహా ఆట ఆడగల సత్తా అశ్విన్‌కు ఉంది. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అశ్విన్.. ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచుల్లో ఆట ముగియగానే ఆ ఫీల్ పోకూడదని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్‌లో కూడా అతను బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ఆడే జట్టులో అశ్విన్‌ను తీసుకోవాలని టీం మేనేజ్‌మెంట్ ఒక నిర్ణయానికి వచ్చేసిందట. ఇటీవలి కాలంలో టీ20లు, వన్డేలకు దూరంగా ఉంటున్న అశ్విన్.. కేవలం టెస్టులే ఆడుతున్న సంగతి తెలిసిందే. అయినా గతేడాది టీ20 వరల్డ్ కప్ ఆడిన అతను.. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌లో కూడా చోటు దక్కించుకోవడం ఆశ్చర్యకరం.