టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు లేదని, అతన్ని తీసుకోవడం అనవసరమని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. వన్డేల్లో ఎలా ఆడాలో ఇప్పటికీ సూర్యకు ఐడియా లేదని విమర్శించాడు. మిడిలార్డర్‌లో వచ్చే సూర్యకు 25-40 ఓవర్ల మధ్య ఎలా బ్యాటింగ్ చేయాలో క్లారిటీ లేదని బంగర్ అభిప్రాయపడ్డాడు. అలాంటి వాడిని ఇప్పుడు టీంలోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్నాడు.
వరల్డ్ కప్ ఆడే టీంలో కూడా సూర్యకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న టీంలో కూడా సూర్య ఉన్నాడు. అయితే వరల్డ్ కప్‌లో పూర్తి బలం ఉన్న టీంతో బరిలో దిగాలని, అంతేకానీ ఇలాంటి టైంలో ప్లేయర్‌కు గేమ్ టైం కోసం చూడటం సరికాదని బంగర్ చెప్పాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సూర్య బ్యాటింగ్ గురించి బంగర్ వివరించాడు.

మిడిల్ ఓవర్లలో బౌండరీలు వెతుక్కోవడం చాలా కష్టమని, ఆ టైంలో ఆడటం కోసం సూర్య తన ఆటను చాలా మార్చుకోవాల్సి ఉంటుందని బంగర్ చెప్పుకొచ్చాడు. 'రాహల్ ద్రావిడ్‌తో మాట్లాడానని సూర్య చెప్పాడు. మిడిల్ ఓవర్లలో బౌండరీలు అంత త్వరగా రావు. ఇక బంతి పాత పడిన తర్వాత ఏం చేస్తాం? అనేది సమస్య. ఎందుకంటే టీ20ల్లో చివరి వరకు బంతి గట్టిగానే ఉంటుంది. వన్డేల్లో చివరి ఐదు ఓవర్లలో బంతి మెత్తపడిపోయి బౌండరీలు అసలు రావు' అని బంగర్ చెప్పాడు.
'ఇలాంటి టైంలో కూడా బౌండరీలు బాదడం ఎలాగో ఎవరికి వారే ఒక ఐడియాకు రావాలి. సూర్య చాలా వర్సటైల్ ప్లేయర్. తనకు ఎక్కడ బౌండరీలను టార్గెట్ చేయాలో బాగా తెలుసు. అయితే 25 నుంచి 40వ ఓవర్ వరకు ఎలా బ్యాటింగ్ చేయాలో సూర్యకు తెలియదు. ఈ టైంలో ఎలా పరుగులు చేయాలనే క్లారిటీ అతనికి లేదు. టీ20ల్లో ఆడినట్లే తను ఆడేయొచ్చు. కానీ వికెట్లు పడితే స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేయాల్సి ఉంటుంది' అని బంగర్ తెలిపాడు.
ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో జట్టు బ్యాలెన్స్‌ను దృష్టిలో పెట్టుకోవాలని బంగర్ చెప్పాడు. 'సూర్యకు అవకాశం ఉంటే ఆడించొచ్చు. కానీ తనకు కూడా గేమ్ టైం ఉండాలని ఆడించడం కరెక్ట్ కాదు. అలా చేయాల్సిన అవసరం టీంకు లేదు. రోహిత్, ద్రావిడ్ కూడా అదే చేస్తారని అనుకుంటున్నా. సరైన కాంబినేషన్లకు అవసరమైన ప్లేయర్లనే ఆడిస్తారు. ఇక ప్లేయర్‌కు గేం టైం కోసం ప్రయోగాలు చేయాల్సిన టైం ఇది కాదు' అని బంగర్ స్పష్టం చేశాడు.