వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలవడంతో ఇప్పుడు అందరూ ఒక్కో జట్టు ఈ టోర్నీలో ఎలా ఆడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ దిగ్గజాలు కూడా కప్పు కోసం పోటీ పడే జట్లు ఏవో అంచనాలు వేశారు. వీరిలో టీమిండియా మాజీ దిగ్గజాలు కూడా ఉన్నారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈసారి వరల్డ్ కప్ ట్రోఫీ కోసం పోటీ పడే టీమ్స్‌లో టీమిండియా లేదని స్పష్టంగా చెప్పేశాడీ లిటిల్ మాస్టర్. కప్పు కోసం పోటీ పడే రెండు, మూడు సీరియస్ కంటెండర్లు ఎవరు? అని ప్రశ్నించగా.. 'ఎంతమంది? రెండు, మూడు టీమ్సా? ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్' అని తేల్చేశాడు. అతనితోపాటు ఈ చర్చలో పాల్గొన్న మిగతా వారంతా ఇది విని షాకయ్యారు కూడా.

ఇదే కార్యక్రమంలో ఉన్న హర్భజన్ సింగ్ ఈ ఎంపికతో ఏకీభవించలేదు. పాకిస్తాన్ స్థానంలో భారత్‌ను ఎంచుకున్నాడు. 'నన్నడిగితే.. ఇది చాలా ఒత్తిడి ఉండే టోర్నీ కాబట్టి.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా మధ్య పోటీ ఉంటుంది. ముఖ్యంగా టోర్నీ జరిగేది భారత్‌లోనే కాబట్టి.. టీమిండియాను తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు' అని తన అభిప్రాయం చెప్పాడు.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా హర్భజన్ సింగ్‌తో ఏకీభవించాడు. అయితే పాకిస్తాన్ కూడా ట్రోఫీ కోసం గట్టి పోటీ ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. 'నేను కూడా భజ్జీ చెప్పిన జట్లనే ఎంచుకుంటా. అదే సమయంలో పాకిస్తాన్‌ను నాలుగో కంటెండర్‌గా చెప్తా. అంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్.. నాలుగు జట్ల మధ్య పోటీ అని నా అభిప్రాయం' అని దాదా అన్నాడు.
ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ మాథ్యూ హేడెన్ మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పక్కన పెట్టేశాడు. పాకిస్తాన్, ఇండియా, ఆస్ట్రేలియా మాత్రమే ట్రోఫీ కోసం పోటీ పడతాయన్నాడు. బడా టోర్నీల్లో ఇంగ్లండ్ అద్భుతంగా రాణిస్తున్నా కూడా.. భారత్‌లో ఉండే పరిస్థితులు వారికి ప్రతికూలంగా మారతాయని అభిప్రాయపడ్డాడు. మరి వీరిలో ఎవరి అంచనా నిజం అవుతుందో చూడాలి.