పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచులో శ్రీలంక బ్యాటర్లు చెలరేగారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక భారీ స్కోరు చేసింది. పాక్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న కుశాల్ మెండిస్ (77 బంతుల్లో 122), సదీర సమరవిక్రమ (89 బంతుల్లో 108) సెంచరీలతో సత్తా చాటారు.
మిగతా బ్యాటర్లలో పాథుమ్ నిస్సంక (51) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా.. ధనంజయ డి సిల్వ (25), కెప్టెన్ దాసున్ షనక (12), దునిత్ వెల్లలెగె (10) పెద్దగా రాణించలేదు. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు. హారిస్ రవూఫ్ కూడా రెండు వికెట్లతో రాణించాడు.

మిగతా బౌలర్లలో షహీన్ అఫ్రిదీ, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. కానీ మెండిస్, సమరవిక్రమ జోరుకు మాత్రం వీళ్లు కళ్లెం వేయలేకపోయారు. వాళ్లిద్దరినీ కూడా పాక్ బౌలర్లు కట్టడి చేసి ఉంటే శ్రీలంక ఇంత భారీ స్కోరు చేయగలిగేది కాదు. అయితే హైదరాబాద్ పిచ్ బ్యాటర్లకు మంచి సహకారం అందిస్తుందని పేరు. కాబట్టి పాక్ కూడా ఇదే మాదిరి ఆటతో అదరగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అంతకుముందు వరల్డ్ కప్ వార్మప్ మ్యాచుల్లో కూడా హైదరాబాద్‌లో భారీ స్కోర్లు నమోదైన సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక స్పిన్నర్లను పాక్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. గత మ్యాచులో పాక్ గెలిచినా కూడా వారి బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదనే మాట కాదనలేని సత్యం. వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌తో పాక్ తొలి మ్యాచు ఆడింది. ఆ మ్యాచులో పాక్ బ్యాటింగ్ తడబడిన సంగతి తెలిసిందే.