వరల్డ్ కప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడని మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. పన్నెండేళ్ల క్రితం సీనియర్లతో కలిసి తొలి వరల్డ్ కప్ ఆడిన కోహ్లీ.. ట్రోఫీ ముద్దాడాడు. ఈ సమయంలో తన చివరి వరల్డ్ కప్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్‌ను భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిప్పాడు యంగ్ కోహ్లీ. ఆ విషయాన్ని సెహ్వాగ్ గుర్తుచేశాడు.
అప్పట్లో సచిన్‌కు ఎంత ఫాలోయంగ్ ఉండేదో.. ఇప్పుడ కోహ్లీకి కూడా అంత స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. సచిన్ పేరిట ఉన్న చాలా రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడు కూడా. అయితే గతేడాది వరల్డ్ కప్‌లో కోహ్లీ అంత గొప్పగా ఆడలేదు. సరదా కోసం సెంచరీలు చేసే కోహ్లీ.. 2019 వరల్డ్ కప్‌లో ఒక్క శతకం కూడా సాధించలేదు. దీన్ని కూడా సెహ్వాగ్ ప్రస్తావించాడు.

'2019 వరల్డ్ కప్‌లో చీకూ (కోహ్లీ) ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ ఏడాది సాధ్యమైనన్ని సెంచరీలు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవాలని ఆశిస్తున్నా. ఇక చివరగా అతన్ని కూడా ఎవరైనా భుజాలపై ఎక్కించుకొని స్టేడియం అంతా ఒక రౌండ్ తిప్పాలి' అని సెహ్వాగ్ కోరుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ కూడా ఈ టోర్నీలో టీమిండియాకు చాలా ముఖ్యమని చెప్పాడు.
పన్నెండేళ్ల క్రితం వరల్డ్ కప్ గెలిచిన టీంలో రోహిత్ శర్మ లేడు. అయితే ఈసారి మాత్రం జట్టుకు అతను కూడా చాలా కీలకమని సెహ్వాగ్ అన్నాడు. 'రోహిత్, కోహ్లీ ఇద్దరూ వరల్డ్ కప్ సాధించాల్సిన ప్లేయర్లు. 2011 వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మ సెలెక్ట్ అవ్వాల్సింది. అతను కచ్చితంగా సెలెక్ట్ అవుతాడనే అనుకున్నాం. కానీ చివర్లో అది జరగలేదు' అని చెప్పాడు.
అయితే ఆ తర్వాత వన్డేల్లో బాద్‌షాగా రోహిత్ ఎదిగాడని సెహ్వాగ్ తెలిపాడు. తను ఇంత అద్భుతమైన ప్లేయర్ అయినందుకైనా వరల్డ్ కప్ గెలవాలి అని ఆశించాడు. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ మొదలవనుండగా.. భారత జట్టు తమ తొలి మ్యాచులో 8వ తేదీన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుందనే సంగతి తెలిసిందే.