వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. వరుస విజయాలతో దుమ్ములేపుతూ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచిన సౌతాఫ్రికాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో పసికూన నెదర్లాండ్స్ చేతిలో సఫారీలు చావుదెబ్బ తిన్నారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఒకానొక దశలో 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల స్కోరు చేసింది.

ఛేజింగ్‌లో క్వింటన్ డీ కాక్ (20), టెంబా బవుమా (16) ఇద్దరూ కూడా సఫారీ జట్టుకు సరైన ఆరంభం అందించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రాసీ వాన్ డర్ డస్సెన్ (4), ఎయిడెన్ మార్క్రమ్ (1) కూడా తేలిపోయారు. చివర్లో కేశవ్ మహరాజ్ (40) జట్టుకు అండగా నిలిచాడు. కానీ చివరి ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అతను కూడా పెవిలియన్ చేరడంతో ఈ జట్టు 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ విజయంపై నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ సంతోషం వ్యక్తం చేశాడు. 'మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నా. ఓడిన రెండు మ్యాచుల్లో కూడా మేం మంచి ప్రదర్శన చేశాం. గెలిచే స్థానంలో ఉండి ఆ తర్వాత ఓడిపోయాం. ఈ పిచ్‌పై పోరాడగలిగే స్కోరు అని అనుకున్న స్కోరు సాధించాం. కొన్ని కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాం. చాలా మంది ఫ్యాన్స్ నిద్ర మానుకొని ఈ మ్యాచ్ చూసుంటారు కదా. మాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. దానికి చాలా రుణపడి ఉంటాం' అని చెప్పుకొచ్చాడు.
'మేం ఈ టోర్నీలో సెమీఫైనల్స్ చేరాలని వచ్చాం. అలా చేరాలంటే కొన్ని బలమైన టీమ్స్‌ను ఓడించాలి. వాటిలో సౌతాఫ్రికా ఒకటి. ఈ టీం ఫేవరెట్లల ఒకటి. వాళ్లు ప్రస్తుతం ఆడుతున్న తీరు అద్భుతం. అలాంటి టీంపై విజయం సాధించడం మాకు చాలా గొప్ప విషయం' అని ఎడ్వర్డ్స్ అన్నాడు. ఈ మ్యాచులో మంచి పోరాట పటిమ కనబరిచిన అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కడం గమనార్హం.