వన్డే వరల్డ్ కప్‌లో పసికూన నెదర్లాండ్స్ సంచలనం సృష్టించింది. సౌతాఫ్రికాను ఓడించి ఈ మెగాటోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఒక టెస్టు ప్లేయింగ్ దేశంపై నెదర్లాండ్స్ సాధించిన తొలి వన్డే విజయం ఇదే కావడం గమనార్హం. అలాగే టెస్టులు ఆడని ఒక పసికూన చేతిలో వన్డేల్లో ఓడిపోవడం సఫారీలకు కూడా ఇదే తొలిసారి. ఈ విజయంలో నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకరన్ కీలక పాత్ర పోషించాడు.
సూపర్ ఫామ్‌లో ఉన్న సఫారీ ఆల్‌రౌండర్లు ఎయిడెన్ మార్క్రమ్, మార్కో యాన్సెన్ ఇద్దర్నీ అతను పెవిలియన్ చేర్చాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచులో 246 పరుగుల లక్ష్యంతో సఫారీలు బరిలో దిగారు. ఆరంభం నుంచే తడబడిన ఈ జట్టు ఒత్తిడికి తలొగ్గింది. ఈ క్రమంలో మీకరన్ బౌలింగ్‌లో మార్క్రమ్ అవుటవడంతో సఫారీలు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు.

ఇలా రెండు కీలక వికెట్లు తీసుకొని సౌతాఫ్రికా ఓటమిలో కీలక పాత్ర పోషించిన మీకరన్ కొంతకాలం క్రితం చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. 2020లో కరోనా మహమ్మారి యూరప్‌ను కమ్మేసిన సంగతి తెలిసిందే. ఈ కరోనా కారణంగా ఆ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ కూడా వాయిదా పడింది. దీంతో క్రికెట్ అభిమానులు చాలా నిరుత్సాహ పడ్డారు. ఆ సమయంలోనే మీకరన్ ఒక ట్వీట్ చేశాడు.
'ఈ టైంలో క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఇప్పుడు ఉబర్ ఈట్స్ డెలివరీ చేస్తున్నా. ఈ చలికాలం గడవడానికి ఇది తప్పదు. పరిస్థితులు ఎంతలా మారిపోతాయో తలచుకుంటే ఒక్కోసారి నవ్వొస్తుంది. ఏదేమైనా అందరూ నవ్వుతూ ఉండండి' అంటూ మీకరన్ ట్వీట్ చేశాడు. ఎప్పుడో 2020 నవంబరులో చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది.
అప్పుడు ఉబర్ ఈట్స్ డెలివరీ చేసిన అదే మీకరన్.. ఇప్పుడు నెదర్లాండ్స్ ఇలా చరిత్ర సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడని ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలాంటి ప్లేయర్లు చాలా అరుదుగా వస్తుంటారని కొనియాడుతున్నారు. ఇక టైటిల్ ఫేవరెట్లలో ఒకటి అనుకున్న సఫారీలను ఇలా నెదర్లాండ్స్ ఓడించడం అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి.