వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. వరుస విజయాలతో దుమ్ములేపుతూ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచిన సౌతాఫ్రికాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ధర్మశాల వేదికగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో పసికూన నెదర్లాండ్స్ చేతిలో సఫారీలు చావుదెబ్బ తిన్నారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ ఆలస్యంగా జరిగింది. ఆ తర్వాత మళ్లీ వర్షం పడటంతో మ్యాచును 43 ఓవర్లకు కుదించారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సఫారీ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ పెద్ద స్కోరు చేయదని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే ఆ జట్టు 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఎలాంటి అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు.

తన తోటి బ్యాటర్లు ఒక్కొక్కరే పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. ప్రతి ఒక్కరితో చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగుల స్కోరు చేసింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సఫారీ బ్యాటర్లు ఈ ఛేజింగ్‌ను సునాయాసంగా పూర్తి చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వాళ్లందరూ ఒత్తిడికి తలొగ్గారు.
నెదర్లాండ్స్‌కు అనుకోని స్కోరు లభించడంతో సఫారీ బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. దానికితోడు నెదర్లాండ్స్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. దీంతో సఫారీ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న క్వింటన్ డీ కాక్ (20), టెంబా బవుమా (16) జట్టుకు సరైన ఆరంభం అందించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రాసీ వాన్ డర్ డస్సెన్ (4), ఎయిడెన్ మార్క్రమ్ (1) కూడా తేలిపోయారు.

ఇలా కష్టాల్లో పడిన సఫారీ జట్టును హెన్రిక్ క్లాసెన్ (28), డేవిడ్ మిల్లర్ (43) ఆదుకునే ప్రయత్నం చేశారు. మార్కో యాన్సెన్ (9), గెరాల్డ్ కోట్జీ (22), కగిసో రబాడ (9), లుంగి ఎన్గిడీ (7 నాటౌట్) పరుగులు చేశారు. చివర్లో కేశవ్ మహరాజ్ (40) జట్టుకు అండగా నిలిచాడు. కానీ చివరి ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అతను కూడా పెవిలియన్ చేరడంతో ఈ జట్టు 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది.