Team India: నెదర్లాండ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) అదరగొట్టారు. ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ దంచికొట్టడంతో భారత జట్టు ఏకంగా 410 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
ఈ క్రమంలోనే వరల్డ్ కప్‌లలో టీమిండియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. దాన్ని రాహుల్ బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో వీళ్లిద్దర్నీ కూడా టీమిండియా మాజీ లెజెండ్ సంజయ్ మంజ్రేకర్ ఆకాశానికి ఎత్తేశాడు. రాహుల్, అయ్యర్ ఇద్దరూ కూడా అద్భుతమైన ఆటగాళ్లని కితాబిచ్చాడు.

'నాలుగో స్థానంలో టీమిండియాకు సరైన ప్లేయర్ శ్రేయాస్ అయ్యరే. అలాగే కేఎల్ రాహుల్ కూడా సూపర్ ప్లేయరే. వీళ్లిద్దరూ కూడా నాలుగైదు డాట్ బాల్స్ పడగానే ఒత్తిడిలోకి వెళ్లే రకం కాదు. అలాగే డాట్ బాల్స్ ఒత్తిడితో రిస్క్ ఎక్కువుండే షాట్ ఆడే రకం కూడా కాదు' అని వివరించాడు.
'సర్కిల్‌లో ఐదుగురు ఫీల్డర్లు ఉన్నా కూడా సింగిల్స్ కాజేయగల ట్యాలెంట్ వీళ్లకు ఉంది. అలాగే వీళ్లిద్దరి దగ్గర డిఫరెంట్ గేర్స్‌లో ఆడగలిగే సత్తా కూడా ఉంది. టీమిండియాలో బ్యాటింగ్ నాణ్యత కనబడుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో కూడా ఆడే శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వీళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు' అని మంజ్రేకర్ మెచ్చుకున్నాడు.

ఈ బ్యాటింగ్ లైనప్‌ను తెగ మెచ్చుకున్న అతను.. 'ఈ బ్యాటింగ్ లైనప్‌ను చూసి ఆశ్చర్యపోవడానికి, అలాగే స్ఫూర్తి పొందడానికి ఎంతో ఉంది. బాగా ఆలోచించిన తర్వాత నా మనసుకు తోచిన మాట బ్యాటింగ్ పెడిగ్రీ. వీళ్లందరూ కూడా వేరే వేరే ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం ఆడిన వాళ్లే కదా' అని చెప్పుకొచ్చాడు.