వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తను ప్రస్తుతం ఫామ్ గురించే ఆలోచిస్తున్నానని చెప్పాడు. రోహిత్ కనుక తను అనుకున్నది సాధిస్తే.. ఈ వరల్డ్ కప్‌లో కూడా ప్రత్యర్థులకు అతను ముచ్చెమటలు పట్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2019 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఎలాంటి ఫామ్‌లో ఉన్నాడో చెప్పాల్సిన పని లేదు.
ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు బాదిన రోహిత్.. ఓవరాల్‌గా 648 పరుగులతో రాణించాడు. ఈ వరల్డ్ కప్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత నెమ్మదిగా రోహిత్ ఫామ్ మందగిస్తూ వచ్చింది. ఇప్పుడు మరోసారి వరల్డ్ కప్ వచ్చేసింది. దీంతో రోహిత్ ఫామ్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో తన ఫామ్ గురించి రోహిత్ కూడా మాట్లాడాడు. బయట నుంచి వస్తున్న కామెంట్లను తను ఏమాత్రం పట్టించుకోబోనని స్పష్టం చేశాడు.

2019 వరల్డ్ కప్ సమయంలో తను ఎలాంటి మైండ్ సెట్‌తో ఉన్నానో.. దాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో ఎలాగైనా రాణించాలని రోహిత్ భావిస్తున్నాడు. చివరగా భారత్‌లో వరల్డ్ కప్ జరిగినప్పుడు భారత జట్టులో రోహిత్ లేడు. అందుకే అతను ఈ వరల్డ్ కప్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు.
ఇప్పటి వరకు వరల్డ్ కప్‌లలో రోహిత్ 17 మ్యాచులు ఆడి 978 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్‌లలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ (1030) తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ గురించి రోహిత్ తన మనసులో మాట బయటపెట్టాడు.
'2019 వరల్డ్ కప్ ముందు ఉన్న ఫేజ్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నా. అప్పుడు నేను మంచి మైండ్ సెట్‌తో ఉన్నా. టోర్నీ కోసం చక్కగా ప్రిపేర్ అయ్యా. మళ్లీ దాన్ని రిపీట్ చేయాలని అనుకుంటున్నా.. దీని కోసం నా దగ్గర టైం కూడా ఉంది. ఆ సమయంలో నేను క్రికెటర్‌గా, వ్యక్తిగతంగా ఏం చేశానో గుర్తుచేసుకుంటున్నా. అప్పట్లో నా ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా' అని రోహిత్ తెలిపాడు.
'నేను రిలాక్స్‌డ్‌గా ఉండటం నాకు చాలా ముఖ్యం. బయటి విషయాలను గురించి వర్రీ అవడం నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి విషయాలను పూర్తిగా పట్టించుకోకూడదని అనుకుంటున్నా. నా ఫోకస్ అంతా కూడా వచ్చే రెండు నెలల్లో నా లక్ష్యాలను ఎలా చేరుకుంటాననే విషయంపైనే ఉంది' అని రోహిత్ వివరించాడు. ప్రస్తుతం ఆసియా కప్ కోసం రోహిత్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.