World Cup 2023: ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీం టీమిండియా. ఆడిన 8 మ్యాచుల్లో ఒక్క ఓటమి కూడా చవిచూడని భారత జట్టు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో సెమీస్ చేరుకుంది. చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ తెగ మెచ్చుకున్నాడు.
టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా కూడా సేవలు అందించిన బంగర్.. ఆటగాళ్లపై రోహిత్ నమ్మకం పెట్టిన విధానానికి ఫిదా అయిపోయాడట. ముఖ్యంగా గాయాలతో జట్టుకు చాలాకాలం దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్.. ఈ ముగ్గురూ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడ కష్టమే అని అంతా అనుకున్నారు.

వీరిలో బుమ్రా ఏకంగా ఏడాదిపైగా ఆటకు దూరమయ్యాడు. చివరకు ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ వెన్నుగాయంతో ఐపీఎల్ ముందు నుంచే జట్టుకు దూరమవగా.. ఐపీఎల్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ కూడా ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వీరిద్దరినీ ఆసియా కప్‌లోనే ఆడిన టీంలోకి రోహిత్ తీసుకున్నాడు.
తమపై కెప్టెన్ ఉంచిన నమ్మకాన్ని వీళ్లు ముగ్గురూ నిరూపించుకున్నారు. 'గాయాల నుంచి కోలుకొని పూర్తి కాన్ఫిడెన్స్ లేని ప్లేయర్లకు రోహిత్ మద్దతుగా నిలిచాడు. బుమ్రా, శ్రేయాస్, కేఎల్ ముగ్గురూ కూడా టీంలో కీలకమైన వాళ్లనే నమ్మకం కలిగించాడు. వాళ్ల సత్తాపై తమకు నమ్మకం ఉందని, వాళ్లకు ఎన్ని అవకాశాలైనా ఇస్తామని ఒక సందేశం పంపాడు. దాంతో దైర్యం తెచ్చుకున్న వాళ్లు చెలరేగుతున్నారు' అని బంగర్ అన్నాడు.

ఒక కెప్టెన్ ఇలా తమపై నమ్మకం ఉంచడం.. ఆటగాడికి చాలా పెద్ద విషయం అని బంగర్ చెప్పాడు. 'ఇలాగే ఆటగాళ్లపై నమ్మకం ఉంచిన మరో కెప్టెన్ సౌరవ్ గంగూలీ. హర్భజన్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా వంటి వాళ్ల సత్తాను గుర్తించిన దాదా.. వాళ్లకు మద్దతుగా నిలిచాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు రోహిత్ కూడా అలాగే చేస్తున్నాడు. నన్నడిగితే జట్టుకు రోహిత్ చేసిన అతి పెద్ద కంట్రిబ్యూషన్.. ఈ ముగ్గురిపై నమ్మకం ఉంచడమే అని చెప్తా' అని పేర్కొన్నాడు.