INDvsENG: వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా.. వరుస ఓటములతో తంటాలు పడుతున్న ఇంగ్లండ్‌ను ఢీకొట్టడానికి సిద్ధమైంది. 2019లో కూడా ఇదే తరహాలో ఊపుమీదున్న టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. ఆ ఓటమికి ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి హిట్ మ్యాన్ ఆర్మీ రెడీ అయింది.
లక్నో వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య కీలక పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్.. బౌలింగ్ ఎంచుకున్నాడు. తమ జట్టు ఆశించినంతగా రాణించలేదని, కానీ ఈ మ్యాచ్‌లో కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తామన్నాడు. హౌస్ ఫుల్ స్టేడియంలో భారత్‌ను ఎదుర్కోవడం నిజంగా ఓ గొప్ప అనుభవమన్న బట్లర్.. ఈ మ్యాచ్‌లో తమ బెస్ట్ ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమకు బ్యాటింగ్ రావడం మంచిదేనన్నాడు. టాస్ గెలిచుంటే తాను బ్యాటింగే ఎంచుకునేవాడినన్నాడు. ఇప్పటివరకు ఛేజింగ్‌లో బాగా రాణించామన్న రోహిత్.. పిచ్ కొత్తదని, కాబట్టి తొలుత బ్యాటింగ్ చేయడమే కరెక్ట్ అనిపిస్తోందన్నాడు. అలాగే మ్యాచ్ గెలవడంపై పూర్తిగా దృష్టి సారించామన్నాడు.
ఇదిలా ఉంటే రెండు జట్లూ తమ టీంలలో ఎలాంటి మార్పులూ చేయలేదు. న్యూజిల్యాండ్‌తో ఆడిన జట్టుతోనే భారత్ ఈ మ్యాచ్ కూడా ఆడుతుండగా.. ఇంగ్లండ్ కూడా శ్రీలంకతో తలపడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం 2019లో టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఆర్మీ బుద్ధి చెప్పాలని, అప్పటి రివెంజ్ ఇప్పుడు తీర్చుకోవాలని కోరుకుంటున్నారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ జట్టు:
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, అదిల్ రషీద్, మార్క్ వుడ్.