ఆసియా కప్‌ను టీమిండియా అండర్ డాగ్స్‌లా ప్రారంభించిందని, కానీ టోర్నీలో ఒక్కో మ్యాచ్‌కూ మెరుగవుతూ వచ్చిందని పాక్ లెజెండ్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఫైనల్ ముగిసిన తర్వాత వరల్డ్ కప్‌లో తామే అందరి కన్నా డేంజరస్ టీం అని టీమిండియా హెచ్చరికలు పంపిందన్నాడు.
ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా మెరుగైందన్నాడు. ఒకటిన్నర ఏళ్ల క్రితం రోహిత్ కెప్టెన్సీ అంత గొప్పగా లేదని, ఏం చేయాలో తెలియనట్లు కనిపించాడని అక్తర్ చెప్పాడు. కానీ ఇప్పుడు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ.. ప్లేయర్లను అద్భుతంగా మేనేజ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు.

'ఒకటిన్నర, రెండేళ్లుగా రోహిత్ కెప్టెన్సీ అంతంతమాత్రంగానే ఉంది. తను ఏదో దారి తప్పినట్లు కనిపించాడు. ఇప్పుడు మాత్రం అద్భుతంగా తన ప్లేయర్లను యూజ్ చేసుకుంటున్నాడు. సరైన టైంలో కుల్దీప్ యాదవ్‌ను టీంలోకి తీసుకొచ్చాడు. అద్భుతమైన డెసిషన్స్ తీసుకుంటున్నాడు' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
'వరల్డ్ కప్ కోసం తాము వస్తున్నామని భారత్ ప్రకటించింది. మెగా టోర్నీలో భారత్ అత్యంత ప్రమాదకరమైన జట్టు అనొచ్చు. మంచి పేస్, స్పిన్ ఎటాక్ ఉన్న బలమైన టీం అది. వరల్డ్ కప్ ముందు ఏయే బాక్సులు టిక్ చేయాలో అన్నింటినీ రోహిత్ సేన కవర్ చేసింది' అని అక్తర్ చెప్పాడు.
'పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్ చూస్తే ఆసియా కప్‌లో భారత్ అండర్‌డాగ్స్‌లా కనిపించారు. ఆ తర్వాత చెలరేగారు. హ్యాట్సాఫ్ ఇండియా' అని అక్తర్ కొనియాడాడు. అతనే కాదు మరో పాక్ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ కూడా భారత బౌలింగ్ ఎటాక్‌ను మెచ్చుకున్నాడు. ఇంగ్లండ్‌లో టెస్టు క్రికెట్ ఆడినట్లు అనిపించిందన్నాడు.
మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఇద్దరి బౌలింగ్ చాలా ఎంజాయ్ చేశానన్నాడు. ఏదో కొత్తగా చేసేందుకు వాళ్లిద్దరూ ప్రయత్నించలేదని, సరైన ప్రదేశాల్లో బంతులు వేశారని విశ్లేషించాడు. ఆసియా కప్ ఫైనల్‌లో భారత పేసర్లు శ్రీలంకను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. వీళ్ల ధాటికి లంకేయులు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అవగా భారత్ ఈజీగా విజయం సాధించింది.