టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బాగా తెలివైన వాడు. అప్పుడప్పుడూ అతను సోషల్ మీడియాలో ట్రోలర్లకు దిమ్మతిరిగే సమాధానాలిస్తూ షాకులు ఇస్తుంటాడు. అయతే తాజాగా అతను ఇచ్చిన సమాధానం విని సదరు ట్రోలర్ కూడా ఫిదా అయిపోయాడు. మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ మొదలవనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అశ్విన్ ఈ టోర్నీ గురించి కామెంటరీ ప్యానెల్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌తో మెగా టోర్నీ ప్లాన్స్ గురించి చర్చించాడట. ఈ విషయాన్ని అశ్విన్ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్.. అశ్విన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ వచ్చారు. అయితే ఒక ట్రోలర్ మాత్రం అశ్విన్‌ను టార్గెట్ చేశాడు.

2014 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడింది. ఆ మ్యాచులో అశ్విన్ చివరి ఓవర్ వేశాడు. అప్పటికి భారత్ ఈ మ్యాచ్ గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. అయితే అశ్విన్ వేసిన చివరి ఓవర్లో పాక్ లెజెండ్ షాహిద్ అఫ్రీదీ రెండు భారీ సిక్సర్లు బాది పాక్‌ను గెలిపించాడు. దీంతో అప్పుడు ఆసియా కప్ ఫైనల్ చేరే ఛాన్స్‌ను భారత్ కోల్పోయింది.
అశ్విన్‌కు ఈ వీడియో ట్యాగ్ చేసిన సదరు ట్రోలర్.. ఈ సిక్సులు గుర్తున్నాయా? అంటూ ఎగతాళి చేశాడు. దీనికి అశ్విన్ చాలా జెన్యూన్‌గా రిప్లై ఇచ్చాడు. 'అవి నిజంగా చాలా గొప్ప షాట్లు బ్రో. మంచి బ్యాటర్‌గా నేను అతని ఆటను చాలా ఎంజాయ్ చేస్తా' అని చెప్పాడు. ఈ రిప్లై విన్న ఫ్యాన్స్.. అశ్విన్ సమాధానానికి ఫిదా అయిపోయారు.
తనను ట్రోల్ చేసిన వ్యక్తికి కూడా ఇంత జెన్యూన్‌గా అశ్విన్ సమాధానం ఇవ్వడం ఇటు భారతీయ క్రికెట్ అభిమానులతోపాటు పాకిస్తాన్ ఫ్యాన్స్‌కు కూడా నచ్చింది. తన హుందాతనం తగ్గకుండా, అఫ్రిదీకి కూడా రెస్పెక్ట్ ఇస్తూ అశ్విన్ ఇచ్చిన ఆన్సర్ అదరహో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.