వరల్డ్ కప్‌లో అద్భుతమైన పట్టుదల కనబరిచి అందరి మనసులు గెలుచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు.. మైదానం బయట కూడా తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఆఫ్ఘన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌లో అర్ధరాత్రి పూట రోడ్డెక్కిన అతను.. ఫుట్‌పాత్‌లపై పడుకునే వారికి దీపావళి బహుమతులు అందజేశాడు.
వరల్డ్ కప్‌లో ఆఫ్ఘన్ జట్టు ప్రయాణం ముగియడంతో ఆ టీం తమ దేశానికి బయలుదేరింది. ఈ క్రమంలో అర్ధరాత్రి మూడు గంటలకు రోడ్డుపైకి వచ్చిన అతను.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారి వద్దకు వెళ్లి ఐదు వందల రూపాయల నోట్లు పెడుతూ వచ్చాడు. సైలెంట్‌గా వాళ్ల పక్కన ఈ నోట్లు ఉంచి ముందుకు వెళ్లిపోయాడు. వాళ్లు కూడా దీపావళిని జరుపుకోవాలనే ఆశతోనే అతను ఇలా చేశాడట.

దీనికి సంబంధించిన వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. 'అహ్మదాబాద్‌లో రోడ్డు పక్కన పడుకునే వాళ్లకు ఇలా ప్రేమను పంచుతున్న రహ్మనుల్లా గుర్బాజ్ కెమెరా కంటికి చిక్కాడు. వరల్డ్ కప్‌లో గట్టి పోరాటం తర్వాత ఈ దేశం విడిచి పెట్టి వెళ్లే ముందు అతను ఈ పని చేయడం గమనార్హం' అని ఈ పోస్టుకు క్యాప్షన్ పెట్టిందీ ఫ్రాంచైజీ.
'ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంప బాధితుల కోసం కష్టపడి విరాళాలు సేకరించడం నుంచి.. ఇలా విదేశీ గడ్డపై కూడా మంచి మనసు పంచుతున్న అతన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం' అని పేర్కొంది. ఈ వీడియో చూసిన చాలా మంది అభిమానులు కూడా గుర్బాజ్ పెద్ద మనసును తెగ మెచ్చుకుంటున్నారు. మైదానంలో ఆటతో, బయట ఇలా మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకుంటున్న ఆఫ్ఘన్ జట్టుపై మరింత గౌరవం పెరుగుతోందని అంటున్నారు.