వరల్డ్ కప్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ అన్యాయంగా ప్రవర్తించిందని పంజాబ్ క్రీడాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ మండిపడ్డారు. చాలా వివక్షతో వరల్డ్ కప్ వేదికలను కేటాయించారంటూ ఆరోపణలతో బీసీసీఐకి లేఖ రాశాడు. పంజాబ్‌లో కూడా కొన్ని వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహించాలంటూ బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీని కోరాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ కప్.. భారత్‌లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవలే ఐసీసీ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం 10 వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతాయి. అయితే పంజాబ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎలాంటి మ్యాచ్‌లు కేటాయించలేదు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ వేదికల కేటాయింపు లోపభూయిష్టంగా ఉందంటూ గుర్మీత్ సింగ్ ఆరోపణలు చేశారు.

'గొప్ప ధైర్యం, చక్కని మర్యాద, సెక్యులర్ ఆలోచనలపై నమ్మకం తదితర అంశాల్లో పంజాబ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. బిషన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్‌నాథ్, యష్‌పాల్ శర్మ, మదన్ లాల్, నవజోత్ సింగ్ సిద్ధూ, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, శుభ్‌మన్ గిల్, అర్షదీప్ సింగ్ వంటి ఎందరో ప్రముఖ క్రికెటర్లను భారత క్రికెట్‌కు అందించిందీ రాష్ట్రం' అని గుర్మీత్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.
పంజాబ్‌లోని క్రీడా సౌకర్యాలు ప్రపంచ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని గుర్మీత్ సింగ్ అన్నారు. మొహాలీలో 1996, 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచులు జరిగాయని గుర్తుచేశారు. అలాగే 2016 టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో కూడా రెండు మ్యాచులు జరిగాయని చెప్పారు. అలాంటి చరిత్ర ఉన్న మొహాలీలో ఇప్పుడు కూడా వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా తమ రాష్ట్రంలో వరల్డ్ కప్ మ్యాచులు జరిగేలా చూడాలని లేఖలో కోరారు.