వన్డే వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటిగా టీమిండియా బరిలో దిగుతోంది. అయితే ఈ జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దర్నీ ఆడించాలా? వద్దా? అని పెద్ద చర్చ జరుగుతోంది. వరల్డ్ కప్ మ్యాచుల్లో వీరిద్దర్నీ కలిపి ఆడించడం వల్ల జట్టులో బ్యాలెన్స్ పోతుందని కొందరి వాదన. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే?
హార్దిక్ బౌలింగ్
అక్షర్, జడేజా ఇద్దరికీ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌తో సంబంధం లేదు. కానీ జట్టు కూర్పులో ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే అక్షర్, జడేజా ఇద్దర్నీ జట్టులో ఆడించాలంటే మూడో పేసర్‌గా బౌలింగ్ భారాన్ని హార్దిక్ పంచుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ టోర్నీ ఆసాంతం టీమిండియా ప్లేయర్లు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఇలాంటి సమయంలో టీమిండియాలో కీలకమైన ప్లేయర్ అయిన పాండ్యాపై ఎక్కువ భారం ఉండకపోవడమే మంచిది. ఈ క్రమంలో మూడో పేసర్‌గా వరల్డ్ కప్‌లో ఆడే అన్ని మ్యాచుల్లో హార్దిక్ తన కోటా 10 ఓవర్లు వేయగలడా? అనేది ప్రశ్న. మళ్లీ అతనికి గాయమైతే జట్టుకు ఎంత నష్టమో చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే 8వ స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా మహమ్మద్ షమీని ఆడించడం బెటర్.
ఒకే తరహా బౌలింగ్..
అక్షర్, జడేజా ఇద్దరూ భిన్నమైన స్పిన్నర్లు అయితే జట్టుకు ఏదో కొత్త ఉపయోగం ఉంటుందని అనుకోవచ్చు. కానీ వీళ్లిద్దరూ దాదాపు ఒకే తరహా బౌలర్లు. వీళ్ల బౌలింగ్ బలాలు, బలహీనతలు కూడా ఒకేలా ఉంటాయి. అప్పుడు ఇలాంటి బౌలర్లను ఇద్దర్ని ఒకే మ్యాచులో ఆడించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏముంది?
ఇటీవల కాలంలో భారత బౌలింగ్ విభాగంలో మంచి వెరైటీ కనిపిస్తోంది. కానీ అక్షర్, జడ్డూ ఇద్దర్నీ ఒకే మ్యాచులో ఆడిస్తే ఆ వెరైటీ పూర్తిగా పోతుంది. అలాగే స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే అక్షర్ బ్యాటింగ్‌ను కూడా టీమిండియా అంతగా ఉపయోగించుకోవడం లేదు. అలాంటప్పుడు ఇద్దర్నీ ఆడించడం దండగే అని చెప్పాలి.
కుల్దీప్‌పై భారం..
అక్షర్, జడ్డూ ఇద్దర్నీ ఒకే మ్యాచులో ఆడిస్తే.. అత్యంత భారం పడేది కుల్దీప్ యాదవ్‌పై. ఎందుకంటే వీళ్లిద్దరూ ఎడం చేతి వాటం బ్యాటర్లపై పెద్దగా ప్రభావం చూపలేరు. వీరి రికార్డులు కూడా దారుణంగా ఉన్నాయి. ఎడం చేతి వాటం బ్యాటర్ల విషయంలో.. 2022లో అక్షర్ బౌలింగ్ సగటు 96 కాగా, 2023లో జడ్డూ బౌలింగ్ యావరేజి 45. వీళ్లిద్దరి గత సంవత్సరాల ప్రదర్శన కూడా లెఫ్ట్ హ్యాండర్ల విషయంలో ఏమాత్రం బాగలేదు.
దీంతో లెఫ్ట్ హ్యాండర్ల వికెట్లు తీయడానికి కేవలం కుల్దీప్ యాదవ్‌పై ఆధారపడాల్సి వస్తుంది. వార్నర్, మిల్లర్, బెన్ స్టోక్స్ వంటి కీలక ప్లేయర్లు కుల్దీప్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటే అతనిపై ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. కాబట్టి అక్షర్ స్థానంలో మరో ఆఫ్‌స్పిన్నర్‌ను తీసుకుంటే లెఫ్ట్ హ్యాండర్లను కూడా కట్టడి చేయొచ్చు.