భారత జట్టు తమ రెండో వరల్డ్ కప్ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొనబోతోంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జయిట్ అవుతున్నారు. కోహ్లీతో ఐపీఎల్ సందర్భంగా గొడవ పడిన నవీన్ ఉల్ హక్ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరూ ఒకరిని చూసి మరొకరు ఎలా రియాక్ట్ అవుతారని అంతా చూస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు కూడా ఇక్కడ తలపడ్డాయి. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద నవీన్ ఫీల్డింగ్ చేస్తుండగా.. అక్కడి ఫ్యాన్స్ అంతా 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ అతన్ని టీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్, భారత్ జట్ల మద్య మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు చాలా మంది ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.

ఆఫ్ఘన్, ఇండియా జట్లు ఇప్పటి వరకు మూడుసార్లు వన్డేలు ఆడాయి. వీటిలో రెండుసార్లు భారత్ నెగ్గగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. వరల్డ్ కప్‌లలో ఈ రెండు టీమ్స్ ఒకే ఒక్కసారి తలపడ్డాయి. 2019 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన ఆ మ్యాచులో ఆప్ఘనిస్తాన్ జట్టు కేవలం 225 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయలేక చతికిలపడింది. ఆ తర్వాత మళ్లీ వరల్డ్ కప్‌లో ఈ రెండు టీమ్స్ ఆడుతున్న మ్యాచ్ ఇదే.
ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ఆటంకం కలిగించబోదని వాతావరణ శాఖ తేల్చిచెప్పింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే చాన్సులు శూన్యమని స్పష్టం చేసింది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియం బౌండరీ లైన్స్ చిన్నవి. కాబట్టి బ్యాటర్లు ఇక్కడ చెలరేగే ఛాన్స్ ఉంది. అయితే స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి మంచి సపోర్ట్ దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండు జట్లలో స్పిన్నర్లు ఈ మ్యాచులో చాలా కీలకం కానున్నారు.