ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో పెద్ద గొడవే జరుగుతోంది. వరల్డ్ కప్‌లో ఆ జట్టు దారుణ ప్రదర్శన వల్ల ఈ గొడవ మరింత పెద్దది అవుతోంది. మెగాటోర్నీలో పాక్ పేలవ ప్రదర్శనతో కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై కూడా తెగ విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో చాలా మంది మాజీలు అతని కెప్టెన్సీని తెగ విమర్శించారు.
ఇలాంటి సమయంలో రషీద్ లతీఫ్ మాత్రం బాబర్‌కు అండగా నిలిచాడు. టీం చెత్త ప్రదర్శనకు కేవలం బాబర్‌ను బాధ్యుడిని చేయకూడదన్నాడు. అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి కూడా షాకింగ్ విషయాలు వెల్లడించాడు. కొన్ని రోజులుగా పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్‌ను కాంటాక్ట్ అవ్వడానికి బాబర్ ప్రయత్నిస్తున్నాడని, కానీ అష్రాఫ్ మాత్రం స్పందించడం లేదని చెప్పాడు.

ఈ వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించిన జాకా అష్రాఫ్.. బాబర్ తనను కాంటాక్ట్ చేసే ప్రయత్నమేమీ చేయలేదన్నాడు. ఈ గొడవ అక్కడితో సద్దుమణగలేదు. ఎందుకంటే అష్రాఫ్ వైపు నుంచి బాబర్ పర్సనల్ చాట్స్ కూడా లీక్ చేయడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ వీటిని బయటపెట్టాడు. బాబర్, పీసీబీ సీవోవో మధ్య జరిగిన చాట్‌ను నేషనల్ టెలివిజన్‌పై ఉంచాడు.
ఇలా చాట్‌ను బయటపెట్టడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ లెజెండ్ షాహిద్ అఫ్రిదీ కూడా దీన్ని తప్పుబట్టాడు. ఇలా ఒక ఆటగాడి పర్సనల్ చాట్స్ ఎలా బయటపెడతారని నిలదీశాడు. ఇంత కన్నా చెత్త పని మరొకటి ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ చాట్స్ లీక్ చేయడాన్ని ఒక గేమ్ అని చెప్పాడు.

'పీసీబీ చైర్మన్‌ను కాంటాక్ట్ అవడానికి బాబర్ ప్రయత్నించాడని రషీద్ లతీఫ్ అన్నట్లు నాకు తెలిసింది. కానీ చైర్మన్ స్పందించలేదని అతను చెప్పాడు. ఈ వ్యాఖ్యలను కౌంటర్ చేయడానికి ఈ వాట్సాప్ చాట్ గేమ్ ఆడుతున్నారు. అసలు ఒక వ్యక్తి ప్రైవేట్ మెసేజిలను అలా లైవ్ టీవీలో ఎలా పెడతారు? ఇంతకన్నా దిగజారుడు తనం ఉంటుందా?' అని అఫ్రిదీ అన్నాడు.