PAKvsAFG: వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఇటీవల డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్ టీం.. ఇప్పుడు పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగిన ఆఫ్ఘన్ అన్ని విభాగాల్లోనూ సత్తా చాటింది. దీంతో పాకిస్తాన్‌కు ఈ మెగాటోర్నీలో మరో ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఇమామ్ ఉల్ హక్ (17) మరోసారి విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో అబ్దుల్లా షఫీక్ (58), బాబర్ ఆజమ్ (74) కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ ఆఫ్ఘన్ స్పిన్నర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వీళ్లిద్దరికీ భారీ షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదు.

దీంతో మిడిల్ ఓవర్లలో పాక్ ఇన్నింగ్స్ నత్త నడకన సాగింది. ఇక చివర్లో గేరు మార్చే ప్రయత్నంలో బాబర్ కూడా అవుటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షాదాబ్ ఖాన్ (40), ఇఫ్తికర్ అహ్మద్ (40) ధనాధన్ షాట్లతో అలరించారు. వీరిద్దరూ జోరుగా ఆడటంతో పాకిస్తాన్ 282/7 పరుగుల స్కోరు చేయగలిగింది.
ఛేజింగ్‌ను ఆఫ్ఘన్ ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (65), ఇబ్రహీం జద్రాన్ (85) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆ తర్వాత వచ్చిన రహ్మత్ షా (77 నాటౌట్), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (48 నాటౌట్) తమ పట్టుదల చూపించారు. వీళ్లు కూడా మిడిల్ ఓవర్లలో నిదానంగానే ఆడారు. కానీ చివరి పది ఓవర్లలో సింగిల్స్, డబుల్స్ తీస్తూ పాక్ ఫీల్డర్లపై ఒత్తిడి పెంచారు.
చివరకు అద్భుతమైన విజయం సాధించారు. దీనిపై స్పందించిన ఆఫ్ఘన్ కెప్టెన్ షాహిదీ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ విజయం చాలా రుచిగా ఉంది. చాలా ప్రొఫెషనల్‌గా ఛేజ్ చేశాం. మేం కొంత కాలంగా క్వాలిటీ క్రికెట్ ఆడుతున్నాం. పాజిటివ్ క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు స్పిన్నర్లు చెలరేగారు. నూర్‌కు అవకాశం ఇస్తే సత్తా చాటాడు. ఆరంభం నుంచి మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది' అని చెప్పాడు.