హైదరాబాద్: వరల్డ్ కప్ 2023లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. శ్రీలంక జట్టును ఢీ కొట్టబోతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయదుందుభి మోగించడానికి ఉవ్విళ్లూరుతోంది బాబర్ ఆజమ్ సేన.
ఇదివరకు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయ కేతనాన్ని ఎగురవేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 286 పరుగులు చేసింది. 287 పరుగుల లక్ష్యంతోబరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు తడబడింది. 41 ఓవర్లల్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది.

పాకిస్తాన్ బౌలర్ల సత్తాకు అద్దం పట్టిన మ్యాచ్ అది. హ్యారిస్ రవూఫ్ అదరగొట్టాడు. మూడు వికెట్లతో సత్తా చాటాడు. హసన్ అలీ-2 వికెట్లు కూల్చాడు. షహీన్ షా అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదబ్ ఖాన్ ఒక్కో వికెట్‌ను తీసుకున్నారు. బౌలర్లందరూ వికెట్లను తీసుకున్నారా మ్యాచ్‌లో.
ఇప్పుడు శ్రీలంకతో ఢీకొట్టబోతోంది పాకిస్తాన్. బాబర్ ఆజమ్ విఫలమౌతోండటం ఆ జట్టుకు మైనస్ పాయింట్. ఫకర్ జమాన్ గానీ, ఇమాముల్ హక్ గానీ భారీ స్కోర్లు సాధించలేకపోతున్నారు. నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో ఓపెనర్లతో పాటు బాబర్ ఆజమ్ కూడా విఫలం అయ్యాడు.
మహ్మద్ రిజ్వాన్, సవూద్ షకీల్ హాఫ్ సెంచరీలతో ఆదుకోకపోయి ఉంటే పాక్ పరిస్థితి మరోలా ఉండేది. చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహ్మద్ నవాజ్, షాదబ్ ఖాన్ ఫర్వాలేదనిపించడంతో స్కోర్ బోర్డును 280ని దాటించగలిగింది పాకిస్తాన్. అదే తరహా బ్యాటింగ్ ఇక్కడా ఆడితే మాత్రం డేంజర్ బెల్స్ తప్పకపోవచ్చు.
అయినప్పటికీ- తుదిజట్టులో పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చు. ఈ నెల 14వ తేదీన భారత్‌తో మ్యాచ్ ఆడబోతోన్నందున జట్టు రిథమ్‌ను అందిపుచ్చుకోవడానికి- అలాంటి ప్రయోగాలకు పూనుకోవడానికి సాహసించకపోవచ్చు. నెదర్లాండ్స్‌పై ఆడిన జట్టుతోనే శ్రీలంకను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు.
శ్రీలంకతో తలపడబోయే తుదిజట్టులో- ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్ (కేప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సవూద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది, హ్యారీస్ రవూఫ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.