ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. మొత్తం పది వేదికల్లో ఈ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయింది. వీటీలో ఒక్క హైదరాబాద్ తప్ప మిగతా అన్ని స్టేడియాల్లో నాలుగైదు మ్యాచులు జరుగుతున్నాయి. ముంబై, కోల్‌కతాలో సెమీఫైనల్స్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ టోర్నీ మొదలవుతుంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో తలపడతాయి.
అక్టోబర్ 8న భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆస్ట్రేలియాను చెపాక్ వేదికగా ఎదుర్కొంటుంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భార్త, పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతుంది. అయితే ఈ టోర్నీలో పాక్ ఆడుతుందా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ టోర్నీలో తాము ఆడతామని కానీ, లేదంటే ఆడబోమని కానీ పాక్ చెప్పలేదు.

అయితే భారత్‌కు పాకిస్తాన్ జట్టును పంపడం కోసం ఆ దేశ ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాలని, అప్పుడే జట్టు భారత గడ్డపై అడుగు పెడుతుందని పీసీబీ చీఫ్ నజాం సేథీ కొన్ని రోజుల క్రితమే చెప్పేశాడు. ఈ విషయంపై పాక్ ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదట. దీంతో పాకిస్తాన్ ఈ టోర్నీ కోసం భారత్‌కు వస్తుందా? రాదా? అనే సందిగ్ధత నెలకొంది. ఒకవేళ పాక్ ప్రభుత్వం కనుక క్లియరెన్స్ ఇవ్వకపోతే పాకిస్తాన్ ఈ టోర్నీని బాయ్‌కాట్ చేసే అవకాశం ఉంది.

లేదంటే తమ మ్యాచుల వేదికను తటస్థ వేదికలకు మార్చాలని డిమాండ్ చేయొచ్చు. ఇలా చేయడానికి బీసీసీఐ అంగీకరిస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదు. దీంతో పాకిస్తాన్ ఈ టోర్నీలో ఆడకపోవచ్చు కూడా. అయితే వేదికల మార్పు కోసం పాకిస్తాన్ డిమాండ్ చేసిన క్రమంలో.. ఆ దేశం ఈజీగా క్లియరెన్స్ ఇచ్చేస్తుందని కొందరు అంటున్నారు. మరి ఏమవుతుందో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయకతప్పదు.