వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌కు వరుణుడు సాయం చేస్తున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. న్యూజిల్యాండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది. దీంతో కివీస్ ఏకంగా 401 పరుగుల భారీ స్కోరు చేసింది.. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే పాక్‌కు గట్టి షాక్ తగిలింది.
యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (9) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 126 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్) ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జమాన్ ధనాధన్ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

వీళ్లిద్దరి జోరుకు ఎలా కళ్లెం వేయాలా? అని కివీస్ ఆలోచిస్తున్న తరుణంలోనే వరుణుడు ఈ మ్యాచ్‌పై కన్నేశాడు. భారీ వర్షం పడటంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కాసేపటికే వర్షం తెరిపిన పడింది. దీంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది. అప్పుడు కూడా జమాన్ తన ఇంజిన్‌లో వేడి తగ్గలేదని నిరూపించాడు.
సోధీ వేసిన 25వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు. దీంతో పాకిస్తాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మళ్లీ వర్షం పడే అవకాశం ఉండటంతో డక్ వర్త్ లూయీస్ (డీఎల్ఎస్) స్కోరును అందుకోవడానికి జమాన్ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతను సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే మళ్లీ వర్షం పడి 26వ ఓవర్లోనే మ్యాచ్ నిలిపి వేయాల్సి వచ్చింది.
జమాన్ దూకుడుతో అప్పటికి పాకిస్తాన్ జట్టు.. డీఎల్ఎస్ స్కోరుకు మరో 21 పరుగులు అదనంగా చేసింది. అప్పటికి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్.. 200 పరుగులు చేసింది. డీఎల్ఎస్ లెక్కన ఆ టీం ఒక్క వికెట్ నష్టానికి 179 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.
అయితే జమాన్ ధాటిగా ఆడటంతో ఈ స్కోరును పాక్ దాటేసింది. ఇక ఎంత సేపటికీ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికే డీఎల్ఎస్ స్కోరు దాటేసిన పాక్.. 21 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ నెగ్గి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటుతో చెలరేగిన ఫకర్ జమాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.