సోషల్ మీడియాలో ఇంగ్లండ్ దిగ్గజం మైఖేల్ వాన్, టీమిండియా దిగ్గజం వసీం జాఫర్ మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. వీళ్లిద్దరూ ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం ప్రతిసారీ ఫ్యాన్స్‌కు సరదాగానే ఉంటుంది. దీని గురించి ఇటీవల మైఖేల్ వాన్ పెదవి విప్పాడు. అసలు తామిద్దరి మధ్య ఈక్వేషన్ ఎలా ఉంటుందో వివరించాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్, డామియన్ మార్టిన్ తదితరులతో ఒక పాడ్‌కాస్ట్‌లో మైఖేల్ వాన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాఫర్ గురించి తన అభిప్రాయం చెప్పాడు. అలాగే ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఓడిపోతుందన్నాడు. ఫైనల్‌లో టీమిండియా ఓడిన తర్వాత జాఫర్‌కు ఇచ్చే గిఫ్ట్ కూడా కొనేశానని చెప్పాడు.

'వసీం జాఫర్ నా మొదటి టెస్టు వికెట్. లార్డ్స్‌లో జరిగిన మ్యాచులో కెవిన్ పీటర్సన్ పట్టిన క్యాచ్‌కు జాఫర్ అవుటయ్యాడు. నన్ను సోషల్ మీడియాలో తను రెండు, మూడుసార్లు పట్టేశాడు. కానీ నిజానికి జాఫర్ అకౌంట్‌ను అతను మేనేజ్ చేయడు. వేరే ప్రొఫెషనల్ చేస్తాడు' అని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో వరల్డ్ కప్‌లో భారత్ ఓటమిని అంచనా వేశాడు.
'ఈ వరల్డ్ కప్‌లో భారత్ ఓడిపోయినప్పుడు జాఫర్‌కు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. దాన్ని ఇప్పటికే రెడీ చేసుకున్నా కూడా. నన్ను అడిగితే టీమిండియాను ఆస్ట్రేలియా ఈజీగా ఓడించేస్తుంది' అని అన్నాడు. ఈ వరల్డ్ కప్‌లో భారత్ ఆడిన మొదటి మ్యాచ్ ఆసీస్‌తోనే. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుతంగా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆ తర్వాత మళ్లీ టీమిండియా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా 8 మ్యాచుల్లో విజయం సాధించి సెమీస్ చేరుకుంది. ఆసీస్ కూడా ఆఫ్ఘన్‌పై విజయంతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.