మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ మొదలవనుంది. ఇప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ మ్యాచుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మెగాటోర్నీ టికెట్లు 'బుక్‌మై షో'లో బుకింగ్ చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. అయితే ఈ టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలో బీసీసీఐ ఒక శుభవార్త చెప్పింది.
మాస్టర్ కార్డ్‌లు ఉన్న అభిమానులకు గురువారం సాయంత్రం నుంచే వరల్డ్ కప్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్ ఆడే మ్యాచులకు ఈ ఎర్లీ యాక్సెస్ వర్తించదు. మిగతా మ్యాచుల టికెట్లను గురువారం రాత్రి 8 గంటల నుంచి మాస్టర్ కార్డ్ వినియోగదారులు బుక్ చేసుకునే వీలుంటుంది.

ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడే మ్యాచులు ముఖ్యమే అయినా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా తదితర బలమైన జట్లు ఆడే మ్యాచులపై కూడా అభిమానులు బాగా ఫోకస్ పెడతారనే సంగతి తెలిసిందే. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉంటుంది.
వరల్డ్ కప్ నెగ్గడంలో టీమిండియాకు అడ్డంకిగా మారే అవకాశం ఉన్న ప్రతి జట్టునూ అభిమానులు చాలా క్లోజ్‌గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఎర్లీ యాక్సెస్‌ను బీసీసీఐ తీసుకొచ్చి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా ఈ మెగాటోర్నీ అక్టోబర్ 5 నుంచి మొదలవుతుందన్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తలపడతాయి. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా టీంను ఢీకొంటుంది. అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక అభిమానులంతా ఎదరుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మాదాబాద్ వేదికగా జరగనుంది.