ఈ వరల్డ్ కప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్లలో పాకిస్తాన్ ఒకటి. ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన పాకిస్తాన్.. పేలవమైన ప్రదర్శనతో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో ఆ జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ కూడా పాకిస్తాన్‌ను ఏకిపారేశాడు.
ఈ వరల్డ్ కప్‌లో పాక్ చాలా చెత్తగా ఆడిందన్న మాలిక్.. పాక్ కన్నా ఆఫ్ఘనిస్తాన్ చాలా మెరుగైన క్రికెట్ ఆడిందన్నాడు. 'నా అభిప్రాయంలో మన కన్నా ఆఫ్ఘనిస్తాన్ చాలా మెరుగైన ఆట ఆడింది. కేవలం ఈ వరల్డ్ కప్ గురించే మాట్లాడుకుంటే కచ్చితంగా పాకిస్తాన్ కన్నా ఆఫ్ఘనిస్తాన్ చాలా మెరుగైన క్రికెట్ ఆడిందని ఒప్పుకోక తప్పదు' అని చెప్పాడు.

మాజీ లెజెండ్ వసీం అక్రమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మెగాటోర్నీలో పాక్ కన్నా ఆఫ్ఘన్ మెరుగైన జట్టుగా నిలిచిందన్నాడు. అయితే అలసిపోవడం కూడా పాక్ పేలవ ప్రదర్శనకు ఒక కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు. మాలిక్ అభిప్రాయం విన్న తర్వాత అక్రమ్ కూడా తన ఒపీనియన్ వెల్లడించాడు.
'ఆఫ్ఘన్ ప్లేయర్లు చాలా బలంగా కనిపించారు. మన కుర్రాళ్లు వరుసగా క్రికెట్ ఆడుతూనే ఉండటం వల్ల అలసిపోయారేమో? కానీ ఈ వరల్డ్ కప్‌లో మాత్రం పాకిస్తాన్ కన్నా ఆఫ్ఘనిస్తాన్ చాలా అద్భుతంగా కనిపించింది. ఆ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు' అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
ఈ మెగాటోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. నెదర్లాండ్స్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్ మీద విజయాలు నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. బలమైన ఆస్ట్రేలియాను కూడా ఓడించినంత పనిచేసింది. పాకిస్తాన్‌తో మ్యాచులో అయితే.. బాబర్ వంటి బ్యాటర్లు తడబడిన చెపాక్ పిచ్‌పై పట్టుదలగా ఆఫ్ఘన్ బ్యాటర్లు ఆడారు. కేవలం రెండు వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని సులభంగా ఛేదించారు.