వరల్డ్ కప్ ఆడే టీంను కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టును చూసిన చాలా మంది పెదవి విరుస్తున్నారు. కొంత మంది ఆటగాళ్ల సెలెక్షన్‌ను తప్పుబడుతున్నారు. అదే సమయంలో వరల్డ్ కప్ హీరో, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఈ విషయంపై స్పందించాడు. వరల్డ్ కప్ టీం సెలెక్షన్‌పై మండిపడ్డాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ కోటాలో ఎంపికైన శార్దూల్ ఠాకూర్‌ను ఎందుకు తీసుకున్నారని నిలదీశాడు.
వరల్డ్ కప్ టీంను ప్రకటించే సమయంలో జట్టులో సమతుల్యత ఉండాలని, అలాగే చివర్లో టెయిలెండర్లు కూడా బ్యాటుతో కొద్దోగొప్పో రాణించాలని రోహిత్ అన్నాడు. అందుకే శార్దూల్ ఠాకూర్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. అయితే అతని ఎంపిక చాలా విడ్డూరంగా ఉందని శ్రీకాంత్ అన్నాడు. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో ఈ విషయంపై వాదనకు కూడా దిగాడీ మాజీ లెజెండ్. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ తన సత్తా నిరూపించుకోలేదని కఠినంగా చెప్పాడు.

శార్దూల్ నికరమైన బ్యాటర్ కాదని, అలాగని అతని బౌలింగ్ కూడా అంత గొప్పగా లేదని చెప్పాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత శార్దూల్ టాప్ స్కోర్ కేవలం 25 పరుగులే అని గుర్తుచేశాడు. అంతేకాదు శార్దూల్ తన కెరీర్‌లో ఎన్నిసార్లు వన్డేల్లో పూర్తి కోటా పది ఓవర్లు వేశాడని ప్రశ్నించాడు. ఈ విషయంలో బంగర్, శ్రీకాంత్ గొడవ పడకుండా స్టార్ స్పోర్ట్స్ యాంకర్ అడ్డుకున్నాడు.
ఎనిమిదో నెంబర్‌లో శార్దూల్ బ్యాటుతో పెద్దగా రాణించిన సందర్భాలు లేవని, అలాగే వన్డేల్లో అతను పూర్తి కోటా బౌలింగ్ చేసింది కూడా తక్కువేనని శ్రీకాంత్ చెప్పాడు. అతని కన్నా అర్షదీప్ సింగ్ వంటి స్పెషలిస్ట్ పేసర్‌నో లేదంటే చాహల్ వంటి స్పిన్నర్‌నో టీంలో తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. బంగర్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించడం గమనార్హం.
'ఎనిమిదో నెంబర్‌లో బ్యాటర్ కావాలని అందరూ అంటున్నారు. ఆ స్థానంలో అసలు బ్యాటర్ ఎందుకు? అంతేకాదు, ఆ స్థానంలో శార్దూల్ పది పరుగులే చేస్తున్నాడు. అలాగే అతను పది ఓవర్లు బౌలింగ్ కూడా చేయడు. నేపాల్‌పై కూడా అతను నాలుగు ఓవర్లే కదా బౌలింగ్ చేసింది. వెస్టిండీస్, జింబాబ్వే వంటి టీమ్స్‌పై రాణించాడని వరల్డ్ కప్‌కు తీసుకోకూడదు కదా. ఆ టీమ్స్‌పై రాణిస్తే గుర్తుంచుకోండి. కానీ ఆ ప్రదర్శనలకు ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు' అని శ్రీకాంత్ చెప్పాడు.
'విండీస్, జింబాబ్వే వంటి టీమ్స్‌పై కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి టీమ్స్‌పై చేసిన ప్రదర్శనలకు ప్రాముఖ్యత ఇవ్వండి. అందుకే ఓవరాల్ సగటు చూసి ఫూల్ అవ్వొద్దని చెప్పేది. ఒక్కో మ్యాచ్‌ను వేరుగా చూడాలి' అని శ్రీకాంత్ అన్నాడు. కాగా, శార్దూల్ గతేడాది జనవరి నుంచి 24 వన్డే ఇన్నింగ్సుల్లో బౌలింగ్ చేశాడు. వీటిలో కేవలం రెండుసార్లు మాత్రమే 10 ఓవర్లు వేశాడు. అలాగే 12 ఇన్నింగ్సుల్లో 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన శార్దూల్.. తొమ్మిదిసార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యాడు. ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.